పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నెల రోజుల ఉత్కంఠకు తెరపడనున్నది. భువనగిరి విజేత ఎవరో
తేలిపోనుంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు
విడతలుగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫలితాల నేపథ్యంలో మంగళవారం మద్యం దుకాణలు బంద్
చేయనున్నారు. మరోవైఫు ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు సహా అంతా ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు.
భువనగిరి లోక్‌సభ పరిధిలో భువనగిరి, ఆలేరు, జనగాం, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు నిలిచారు. గత నెల 13న పోలింగ్ జరగ్గా.. ఈవీఎంలను భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో అరోరా కాలేజీలోని స్టాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.
మంగళవారం ఉదయం 5.30గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్రానికి చేరుకోనున్నారు. పాస్‌లు ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్నది. ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేస్తారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. మొదట పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎం ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తారు.
మొదటి రౌండ్ ఫలితం ఉదయం 8.40గంటలకు, చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 3.30గంటలకు వెలువడే అవకాశం ఉంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. జనగాం, ఆలేరు, భువనగిరి, నకిరేకల్‌కు 14 టేబుళ్లు, మునుగోడు, తుంగతుర్తి 18 టేబుళ్లు, ఇబ్రహీంపట్నంలో 20టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక హాల్ ఉంటుంది. ఆయా సెగ్మెంట్లలో పోలింగ్ బూత్‌లను అనుసరించి టేబుళ్లు, రౌండ్లను నిర్ణయించారు. ఈవీఎంలోని డేటా, వీవీప్యాట్లలోని సంఖ్యలను పోల్చి చూస్తారు. ఇవి కాకుండా ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 14 టేబుళ్లు, సర్వీసు ఓటర్లకు 7 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. సర్వీసు ఓటర్లకు సంబంధించి సానింగ్ ద్వారా కౌంటింగ్ నమోదు చేస్తారు. అందుకోసం ఏడు టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సుమారు 800మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు.
అరోరా కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ వద్ద ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లు, వాటర్‌బాటిళ్లు, సిగరెట్లు, మద్యం తదితర వస్తువులను అనుమతించరు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఫోర్స్‌తోపాటు రాష్ట్ర పోలీస్ బలగాలతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఐదురుగుకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండొద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో మగళవారం మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్, బార్లు బంద్ చేయనున్నారు.