నల్లగొండ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వారం పాటు ఎడతెరిపి లేకుండ వర్షం కురిసినందున పత్తితో పాటు వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నల్లగొండ ఏడీఏ నూతన్ కుమార్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 7లక్షల ఎకరాల్లో పత్తి, నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినందున రైతులు ఆయా పంటల్లోకి చేరిన వర్షపు నీటిని వెంటనే తీసివేయాలని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి మురుగు నీరు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని బయటకు పారదోలి పత్తి పంటకు కాపర్ ఆక్సైడ్‌ను లీటర్ నీటిలో కలిపి మొదళ్ల దగ్గర పోయాలని సూచించారు.
అదేవిధంగా పైరు నీరసిస్తే 13-0-45ను ఐదు గ్రాముల్లో లీటర్ నీటిని కలిపి పిచికారి చేస్తే పూర్తిగా రికవరీ అవుతుందన్నారు. మొక్క పూత దశలో ఉన్నట్టయితే వర్షం తగ్గగానే పోషకాల మద్దతు ఇవ్వటానికి పొటాషియం నైట్రేట్ లీటర్ నీటిలో పది గ్రాములు కలిపి పిచికారీ చేయాలని అన్నారు. లేదా ఒక శాతం నీటిలో కరిగే ఎరువు అయినటువంటి 19-19-19ను పిచికారీ చేయాలన్నారు. ఇక సూక్ష్మ పోషకాల నివారణకు ఫార్ములా-4ను ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని సూచించారు.
అదే విధంగా వరిని నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేసినందున ఆ పైరు వేసిన రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గగానే 40 కిలోల యూరియా ను బూస్టర్‌గా వేసుకుంటే త్వరగా పంట కోలుకుంటుందని తెలిపారు. పంట 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్నట్టయితే ఎకరాకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

త్వరితగతిన పంటల సర్వేను పూర్తి చేయాలి
నల్లగొండ రూరల్: సర్వే నంబర్‌వారీగా ప్రభుత్వం చేపట్టిన పంటల సర్వేను త్వరిగతిన పూర్తి చేయాలని , ప్రస్తుతం పత్తి పంట సాగులో వస్తున్న తెల్ల , పచ్చదోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏడీఏ నూతన్ కూమార్ సూచించారు. గురువారం ఆయన మండలంలోని కూధావన్పూర్, చర్లపల్లి గ్రామాలలో పంటల సర్వేలో భాగంగా పర్య టించి పత్తి పంట లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లదోమ నివారణకు ఫోఫెనోపాస్ 2ఎంఎల్ ఒక లీటర్ నీటికి , డైఫెంతురాన్ 1.25 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి వీటికి వేపనూనె 5ఎంఎల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. పచ్చ దోమ నివారణకు ఎసి టమైప్రిడ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి, ఇమిడాక్లోప్రిడ్ 0.4ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ఆయన వెంట ఎఈవో కీర్తన, వాసుదేవరెడ్డి, రైతులు పిన్నపురెడ్డి సైదిరెడ్డి, జాన్‌రెడ్డి ఉన్నారు.