మునుగోడు, ఏప్రిల్ 19: స్వాతంత్య్ర సమరయోధులు కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి నేటి తరానికి స్ఫూర్తిదాయకులని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధులని చెప్పారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివేలలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి వారి విగ్రహాలను గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన కోసం కాకుండా పరుల కోసం జీవిస్తే చరిత్రలో నిలుస్తామనే దానికి గురునాథ్ రెడ్డి, బచ్చిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి నిదర్శనమన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం చేసి, యావత్ తెలంగాణ ప్రజలకు పోరుబాట చూపారని తెలిపారు. ఆనాటి చిన్న కొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథ్ రెడ్డి.. ప్రజలకు ఎంతో సేవ చేసారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో సర్కారు ఉన్నదని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధులు కొండవీటి సోదరులని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహా రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, శ్యాం ప్రసాద్ రెడ్డి, కొండవీటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.