ఆరుగాలం కష్టించి పండించిన పంట కాంగ్రెస్ నేతల పాలైంది. రైతుల ధాన్యాన్నే అడ్డగోలుగా దోచుకోవడమే వారికి చెల్లింది. పోచంపల్లి మండలంలోని పెద్దరావులపల్లిలో ధాన్యం కుంభకోణం వెలుగుచూసింది. భారీ మొత్తంలో ధాన్యం స్వాహాపర్వం బయటపడింది. రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన డబ్బులు ఒక్కరిద్దరు కాంగ్రెస్ నేతల అకౌంట్లో పడటంతో వివాదాస్పదంగా మారింది. అన్నదాత అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అందినకాడికి లక్షలాది రూపాయల వడ్లను అమ్మేసుకోవడంతో అంతా లబోదిబోమంటున్నారు.
యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్‌లో మూడు గ్రామాలకు ధాన్యం కొన్నారు. ఇందులో పెద్దరావులపల్లి ప్రధానమైంది. సుమారు 500 మంది రైతుల నుంచి లక్షల బస్తాల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం సేకరణలో మొదట్లో ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత ఆలస్యంగా కొనుగోళ్లు జరిగాయి. పెద్దరావులపల్లిలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు బడా స్కెచ్‌కు ప్రణాళిక రూపొందించారు. సాధారణంగా రైతులు కాంటా వేశాక.. బిల్ ఎంట్రీ చేస్తారు. ట్రక్‌షీట్ చేశాక.. మిల్లుకు వెళ్తుంది. మిల్లులోనే యాక్సెప్ట్ చేశాక.. డీఎం ఆఫీస్‌లో అప్రూవల్ కొడతారు. ఇక్కడ ధాన్యం మాత్రమే రైతులది కాగా.. మిగతా ప్రాసెస్ మొత్తం ఇద్దరు కాంగ్రెస్ నేతలు చేయించుకున్నట్లు తెలిసింది. రైతులకు తెలియకుండా ధాన్యం కొల్లగొట్టారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారి ధాన్యాన్ని వీరి పేరుపై రాయించుకున్నారు. ఇందుకోసం యాదగిరిగుట్ట మల్లాపురంలో భూమి ఉన్నట్లు సర్టిఫికెట్లు కూడా సృష్టించారనే ప్రచారం జరుగుతోంది.
పెద్దరావులపల్లిలో సుమారు 25 మంది రైతులకు చెందిన దాదాపు 1,400 బస్తాల ధాన్యం స్వాహా చేసినట్లు తెలిసింది. దీని విలువ రూ.14 లక్షల వరకు ఉందని అంచనా. ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్‌పై ఒత్తిడి తెచ్చి.. తొలుత 278 బస్తాల ధాన్యం ఎంట్రీ చేశారు. తర్వాత 100 బస్తాలు, మరోసారి 960 బస్తాలు ఎంట్రీ చేశారు. వీటికి సంబంధించి ఆ గ్రామానికి చెందిన ఇద్దరు నేతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కూడా జమ అయ్యింది. ఒక ఖాతాలో రూ.11.72 లక్షలు, మరో ఖాతాలో రూ.95 వేలు జమ అయ్యాయి. ఇదంతా రైతులకు తెలియకుండా జరిగినట్లు తెలిసింది. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల భూములు వివాదంలో ఉన్నాయని, అధికంగా పంట సాగు అయ్యిందని చెబుతూ ధాన్యాన్ని తమపై ఎంట్రీ చేసుకున్నామని బయట చెబుతున్నట్లు గ్రామంలో చెప్పుకొంటున్నారు. అలాగే అనుకున్నా.. రైతులకు ముందే ఎందుకు చెప్పలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అలా చెప్తే.. శనివారం గ్రామంలో రైతులు ఎందుకు గొడవ చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
వడ్లు అమ్మి రోజులు గడుస్తున్నా ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అందరికీ డబ్బులు జమ కాగా.. తమకు మాత్రమే ఎందుకు రాలేదనే అనుమానాలు రేకెత్తాయి. ఈ విషయంపై ఆరా తీస్తుండగా.. అసలు విషయం బయటకు పొక్కింది. దీంతో శనివారం కొందరు రైతులు లబోదిబోమంటూ రచ్చబండ దగ్గర లొల్లి షురూ చేశారు. డబ్బులు ఏవంటూ మండిపడ్డారు. జరిగిన తతంగాన్ని సదరు కాంగ్రెస్ నేతలు ప నిని చక్కదిద్దే పనిలో పడ్డారు. డబ్బులు ఇస్తామంటూ బతిమాలినట్లు తెలిసింది. కొందరికి తాత్కాలికంగా రూ.10 వేలు, రూ. 20 వేలు ఆన్లైన్ పేమెంట్ చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ధాన్యం డబ్బులు వస్తే వివిధ రకాల ఖర్చుల తీరుతాయని భావించిన రైతులకు గుండె గుబేలుమనే వార్త తెలియడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
ధాన్యం కుంభకోణం నేపథ్యంలో ఓ వాదన వినిపిస్తున్నది. కాంటా వేసే సమయంలో రెండు నుంచి మూడు కిలోల వరకు ధాన్యం కోత పెట్టారు. ఇలా ఒక్కో లారీకి 20 బస్తాల వరకు కటింగ్ పెట్టినట్లు తెలిసింది. కటింగ్ ధాన్యంతో వచ్చే డబ్బులను సెట్ చేద్దామనే స్కెచ్ వేశారనే చర్చ నడుస్తున్నది. సీన్ రివర్స్ అయ్యింది. ఈ తతంగంలో అధికారులు, మిల్లుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు తెలియకుండానే ఇంత సీన్ జరిగిందా అని పశ్నిస్తున్నారు. ఈ విషయంపై సివి ల్ సప్లయి డీఎం హరికృష్ణనను వివరణ కోరగా ఏం జరిగిందనే దానిపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు.