నకిరేకల్, మే 4 : ఓ వైపు ఎండలు..మరోవైపు లారీల కొరత..ఇంకో వైపు అకాల వర్షాలతో కాంటాలు జరగక, అధికారులు పట్టించుకోక రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నెలరోజులు దాటినా కాంటాలు వేయకపోవడంతో అన్నదాతల గుండెలు ధాన్యం కుప్పల వద్దే ఆగిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నెలా పదిహేను రోజులుగా నకిరేకల్ మండలంలోని రైతులు అరిగోస పడుతున్నారు. వడ్లు తెచ్చి నెలరోజులు దాటినా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆలస్యం కావడంతో ఓ రైతు నకిరేకల్ నెల్లిబండ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వరికుప్ప వద్దే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తమ ఎదుటే కుప్పకూలిన రైతును చూసి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మృత్యువాత పడ్డాడని తోటి రైతులు, కుటుంబీకులు మండిపడుతున్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. రైతులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…పట్టణంలోని బాబన్సాహెబ్గూడెంకు చెందిన ఎండీ నజీరుద్దీన్ (68) తనకున్న 3 ఎకరాలతో పాటు 2 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేశాడు. నెల రోజుల క్రితమే తాను పండించిన ధాన్యా న్ని తాటికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నెల్లిబండ కొనుగోలు కేంద్రానికి తెచ్చి ఆరబోశాడు. కొనుగోలు కేంద్రంలో సమయానికి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాశాడు. కాగా సోమవారం ఉదయం 9 గంటల ప్రాంత ంలో నెల్లిబండ కేంద్రంలో ఉన్న ధాన్యం కుప్ప వద్దకు వచ్చి ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ఎలా ఉందో చూద్దామని పట్టాలు తొలగించాడు.
ధాన్యం కుప్పను చూడగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న రైతులు కేకలు వేస్తూ నజీరుద్దీన్ వద్దకు చేరుకున్నారు. ఎంత పిలిచినా లేవకపోవడంతో కళ్లు తిరిగి పడిపోయి ఉంటాడని చెట్టు కిందకు తీసుకెళ్లారు. దాదాపు 10 నిమిషాల అనంతరం గుండెపోటు వచ్చిందేమోననే అనుమానంతో ఓ రైతు 5 నిమిషాల పాటు సీపీఆర్ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. వెంటనే పక్కనున్న మరో రైతు 108కు ఫోన్ చేసి, నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలు నజీరుద్దీన్‌ను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రభుత్వ దవాఖానలో రైతు నజీరుద్దీన్ మృతదేహానికి శవపరీక్షలు చేయకపోవడం గమనార్హం. హడావుడిగా మృతదేహాన్ని తరలించినట్లు సమాచారం.
నజీరుద్దీన్ భార్య 6 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశారు. ఒక కూతురి కుటుంబం బాబన్సాహెబ్గూడెంలో ఉంటూ తండ్రి బాగోగులు చూసుకుంటోంది. కొనుగోలు కేంద్రంలో నమోదైన నజీరుద్దీన్ ధాన్యం వివరాలపై ఇన్‌ఛార్జి తాశీల్దార్ యశ్వంత్‌ను వివరణ కోరగా స్పందించలేదు. అదే విధంగా నెల్లిబండ ధాన్యం కొనుగోళ్లపై పూర్తి సమాచారం ఇవ్వాలని డీటీసీఎస్ జ్యోతిని వివరణ కోరగా ఆమె కూడా స్పందించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణం కోల్పోయిన నజీరుద్దీన్ అంత్యక్రియలు హడావుడిగా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం న్యాయం చేయాలని నజీరుద్దీన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.