సూర్యాపేట, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాజకీయ పెత్తనమో… లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ జిల్లాలోని సుమారు 1600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు అందక ఇక్కట్లకు గురవుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో రూ.13,500 నుంచి 18వేల వరకు వేతనాలు తీసుకునే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వెతలు ఎవరికీ పట్టడం లేదు.
ఆరు నెలలుగా వేతనాలు విడుదల చేయకపోవడంతో ఈఎస్ఐ ల్యాప్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే పీఎఫ్ రెన్యువల్ చే యాలంటే పెనాల్టీతో కలిపి తడిసి మోపెడవుతుంది. ఈ ఆలస్యానికి అధికారులే కారణం. అయితే పెనాల్టీ చెల్లించే విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడం పట్ల మంగళవారం సూర్యాపేట జనరల్ దవాఖాన ఎదుట ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్ల కార్డులతో ధర్నాకు దిగారు.
తమకు వెంటనే వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ (థర్డ్ పార్టీ కాంట్రాక్ట్) ఉద్యోగులకు వేతనాలు అందకపోవడానికి రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు అర్హత లేని కొన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కోర్టు ఉత్తర్వులు బలం చేకూర్చుతున్నాయి. సాధారణంగా మార్చి నెలతో పాత ఏజెన్సీల గడువు ముగియడంతో కొత్తగా టెండర్లు పిలిచి నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంప్యానల్లో చేరుస్తారు.
అయితే ఈ సారి తాత్సారం చేసి నాలుగు నెలల తర్వాత అర్హత లేని కొన్ని ఏజెన్సీలను అధికారులు ఎంప్యానల్లో చేర్చడం.. వారికే బాధ్యతలు అప్పగించడంతో అర్హత ఉన్న ఏజెన్సీల వారు కోర్టుకు వెళ్లారు. దీంతో అధికారులు ఇచ్చిన ఏజెన్సీలను తొలగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చిలో కొత్త కాంట్రాక్టులకు అగ్రిమెంట్లు చేయాల్సి ఉం డగా అవి కాకపోవడం, మరో పక్క పాతవి తాత్కాలికంగా రెన్యువల్ చేయకపోవడం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఏనాడూ చోటు చేసుకోలేదని, రాష్ట్రంలోఏ ఇతర జిల్లా లో కూడా ఆగలేదని పలువురు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆందోళనలకు సిద్ధం..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో మంగళవారం సూర్యాపేట జనరల్ దవాఖానలో విధుల బహిష్కరించి ధర్నాకు దిగారు. చిరు ఉద్యోగులమైన తమ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఇదే పరిస్థితి మరి కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే 1600 మంది ఉద్యోగులు కుటుంబాలతో సహా ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందరికీ వేతనాలు వస్తుంటే అతి తక్కువ జీతాలకే చాకిరీ చేస్తున్న తమకు వేతనాలు చెల్లించకుండా అధికారులు వేధించడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీలు ఎవరికైనా అప్పగించుకోండి.. మా వేతనాలు మాత్రం విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
వేతనాలు చెల్లించాలి
సూర్యాపేటటౌన్, సెప్టెంబర్ 16 ః ప్రభుత్వ జనరల్ దవాఖానలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా జనరల్ దవాఖాన వద్ద ఉద్యోగుల జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. జనరల్ దవాఖానలో పని చేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు తదితర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని కోరారు. గత ఐదు నెలలుగా సూర్యాపేట దవాఖానలో పని చేస్తున్న 126 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రావడం లేదని, పెండింగ్ వేతనాల వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యను ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు విన్నవించామని ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకొని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిసన జేఏసీ నాయకులు అశోక్‌కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రామారావు, నర్సిరెడ్డి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.