హుజూర్నగర్, డిసెంబర్ 14 : రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా ప్రతీకార పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పరిపాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ నేడు రైతుల ఆత్మహత్యలతో అల్లాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిందన్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయకుండా సిగ్గు లేకుండా సంబురాలను చేసుకుంటున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి పేరు మార్చి బ్యాగుల, తొండలరెడ్డి పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపును రాజకీయ దురుద్దేశంతోనే మార్చారని మండిపడ్డారు. సినీ పరిశ్రమలో కాంగ్రెస్‌కు మద్దతు లభించక పోవడంతో వారిని భయపెట్టేందుకే అల్లు అర్జున్ను అరెస్టు చేసి ప్రభుత్వం తప్పిదం చేసిందన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనపైన ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని, తిరుగబడే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్నారు. బతుకమ్మ మన సంస్కృతి కాదంటూ.. అది అగ్రకులాలకే పరిమితమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనడం వారి అహంకార ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ అప్పిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు కేఎల్ఎన్ రెడ్డి, అప్పిరెడ్డి, బెల్లకొండ అమర్, పచ్చిపాల ఉపేందర్, నగేశ్, బాలాజీనాయక్, చంద్రమౌళి, అబ్దుల్ నబీ, భిక్షం, ములకపల్లి రాంబాబు పాల్గొన్నారు.