రామగిరి, మే 4: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న పర్యవేక్షణ అధికారులతో పాటు బోధన సిబ్బంది బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 59 కేజీబీవీల్లో పని చేస్తున్న 680 మందికి లబ్ధి చేకూరనున్నది. నేటి నుంచి దరఖాస్తులకు అవకాశం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న బోధన సిబ్బంది, ప్రత్యేకాధికారులు, పీజీ సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 5 నుంచి 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం బదిలీ కౌన్సెలింగ్ జరుగనుంది. బదిలీల కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, మెంబర్‌గా అదనపు కలెక్టర్, మెంబర్ సెక్రటరీగా డీఈఓ వ్యవహరిస్తారు.
ఉమ్మడి జిల్లాలో 59 పాఠశాలలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 59 కస్తూర్బాగాంధీ పాఠశాలలు ఉండగా.. నల్లగొండలో 27, సూర్యాపేటలో 18, యాదాద్రి భువనగిరి జిల్లాలో 14 ఉన్నాయి. వీటిలో 680 మంది బోధన, ప్రత్యేకాధికారులు, పీఈటీలు, ఏఎన్ఎం పని చేస్తున్నారు. వీరిలో బదిలీకి ఆసక్తి ఉన్న వారు https://transfers.cdse.telangana.gov,.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను ఈ నెల 11న డీఈఓ కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది. బదిలీ ప్రక్రియ అంతా ఈ నెల 29లోగా పూర్తి చేసేలా షెడ్యూల్‌ను ప్రకటించారు.
బదిలీల్లో పలు అంశాలకు పాయింట్లు
కస్తూర్బాలో పనిచేస్తూ మే 1, 2023 నాటికి రెండేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులుగా వెల్లడించారు. ఆయా కేటగిరిల్లో పని చేస్తున్న వారికి వారు బోధించే సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణతశాతం ఆధారంగా పాయింట్స్ ఇవ్వనున్నారు. పీజీ సీఆర్టీలు, ఎస్ఓలకు సైతం ఇదే నిబంధన వర్తించనుంది. గతంలో జరిగిన పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాల్లో వచ్చిన పర్సంటేజీ ఆధారంగా బదిలీలకు పాయింట్స్ యాడ్ కానున్నాయి. దాంతో పాటు పీహెచ్సీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్, టీబీ తదితర వ్యాధులతో బాధపడే వారికి ప్రాధాన్యత కల్పించనున్నారు.
బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం
కేజీబీవీల్లో పని చేస్తున్న బోధన సిబ్బంది, ఎస్ఓ, పీజీ సీఆర్టీ, సీఆర్టీ, ఏఎన్ఎంలు, పీఈటీల బదిలీలకు దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఉత్తర్వులతో ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 5 నుంచి 9 వరకు వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. నిబంధనల మేరకు దరఖాస్తులను పరిశీలించి పారదర్శకంగా బదిలీలను నిర్వహిస్తాం.
– బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ