పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నది. ఇప్పటికే 8 విడుతలు పూర్తి కాగా గత నెల 19న తొమ్మిదో విడుత ప్రారంభమైంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 65.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 5.56 లక్షల మొక్కలు నాటారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున 16.47 లక్షల మొక్కలు అందజేశారు. ప్రధానంగా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 30.20 లక్షలు, డీఆర్డీఏ ద్వారా 8 లక్షల మొక్కలు, మున్సిపాలిటీల ద్వారా 5.28 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. సూర్యాపేట జిల్లాలో 42.49 మొక్కల లక్ష్యానికి ఇప్పటివరకు 15.53 లక్షలు నాటారు. మొక్కలు నాటే పనులు ఎక్కడికక్కడ ముమ్మరంగా సాగుతుండగా వర్షాకాలం నాటికి పూర్తి చేయనున్నారు.
నల్లగొండ, జూలై 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 9వ విడుత హరితహారం కార్యక్రమం సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతుంది. రెండు జిల్లాలో ఈ యేడాది 1,07,99,700 మొక్కల పెంపకమే లక్ష్యంగా ఇప్పటివరకు 37,56,294 మొక్కలు నాటించారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆయా శాఖల ఆద్వర్యంలో 5.56లక్షల మొక్కలు నాటగా ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున 16.47 లక్షల మొక్కలు పంపిణీ చేశారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 88 లక్షల మొక్కలు నాటిన అధికారులు ఈ సారి 65.50లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో ప్రధానంగా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 30.20లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్న యంత్రాంగం.. మరో 8 లక్షల మొక్కలను డీఆర్డీఏ ద్వారా, 5.28లక్షల మొక్కలు మున్సిపాలిటీల ద్వారా నాటి మిగిలినవి ఆయా శాఖల ద్వారా నాటి వాటిని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. హరితహారం లక్ష్యం 65.50లక్షలు కాగా నర్సరీల్లో 76లక్షల మొక్కలు పెంచిన అధికారులు ఈ సీజన్ చివరి నాటికి నాటింపు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గతేడాది నాటిన 93లక్షల మొక్కల్లో 85శాతం మొక్కలు సంరక్షించినట్లు అధికార యంత్రాంగం పేర్కొంటున్నది. సూర్యాపేట జిల్లాలో 42,49,700 మొక్కలు నాటడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు ఖాళీ ప్రదేశాల్లో 5,14,503 మొక్కలు నాటగా ఇండ్లలో 10,38,791 మొక్కలు పంపిణీ చేశారు. మొత్తంగా 15,53,294 మొక్కలు నాటారు. లక్ష్యం పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.
నాటింపు, పర్యవేక్షణ బాధ్యత పాలకవర్గాలదే..
హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంతో ప్రధానంగా వాటిని పరిరక్షించడం వల్లే ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం పాలక వర్గాలపై బాధ్యత పెట్టింది. దాంతో ఆయా గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఈ మొక్కల నాటింపుతో పాటు పర్యవేక్షణ బాధ్యత చేపట్టాయి. అయితే గ్రామాల్లో గుంట తీయడంతో పాటు మొక్క నాటిన తర్వాత పరిరక్షించేందుకు నీటి సరఫరా, వాచర్కు సైతం ఉపాధి నిధుల నుంచి చెల్లించనున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఖాళీ స్థలాలతో పాటు రాష్ట్ర, జాతీయ హైవే రోడ్లలో ఈ మొక్కలను నాటే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారులపై అటవీ శాఖాధికారులు ప్రధాన రహదారులపై కి.మీ.కు 400మొక్కల చొప్పున నాటిస్తున్నారు. ఇక జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ప్రత్యేక లక్ష్యాలు పెట్టుకుని మొత్తంగా 5.28లక్షల మొక్కలను నాటేలా చర్యలు జరుగుతుండగా పట్టణాల్లో మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ పాలకవర్గాలే వీటిని పర్యవేక్షించనున్నాయి.
ఇప్పటి వరకు 5.56లక్షల మొక్కలు నాటించాం
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 7, 07,709 గుంటలు తీయగా అందులో ఇప్పటి వరకు 5,56,441 మొక్కలు నాటించాం. జూన్ 19న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమం ప్రారంభించాం. గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీల పాలక వర్గాల సహకారంతో ఇప్పటి వరకు ఇంటికి 6మొక్కల చొప్పున మొత్తంగా 16.47లక్షల మొక్కలు పంపిణీ చేశాం. ప్రస్తుతం వర్షాలు పూర్తి స్థాయిలో పడగానే ఈ మొక్కల నాటింపు ప్రక్రియ వేగవంతం కానుంది. నాటిన ప్రతి మొక్కను రక్షించే చర్యలు పాలక వర్గాలు చేపట్టనుండగా మా శాఖ నుంచి ప్రభుత్వ ఆదేశానుసారం డబ్బులు చెల్లిస్తాం.
– పరిమి కాళిందిని, గ్రామీణాభివృద్ధి శాఖాధికారి, నల్లగొండ