నల్లగొండ, నవంబర్ 4 : మత్స్యకారుల ఆర్ధిక పురోభివృద్ధికి దోహదపడాల్సిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు ఉపాధిని దెబ్బతీసేలా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే చేప పిల్లల్లో డెవిల్ ఫిష్, క్యాట్ ఫిష్ ఉండడం ఆందోళనకు గురి చేస్తున్నది. నీటి వసతి లేకపోయినా వారం పాటు ఈ చేపలు చెరువుల్లో ఇతర చేప పిల్లలను తినేస్తాయని మత్స్యకారులు వాపోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి భీమసముద్రంలో సోమవారం మత్స్యశాఖ యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 3.61 లక్షల చేప పిల్లలు విడదల చేయగా, అందులో ఇతర చేప పిల్లలను వేటాడి తినే డెవిల్, క్యాట్ ఫిష్ ఉండడం మత్స్యకారులు గుర్తించారు. దాంతో తాజాగా పోసిన చేప పిల్లల సంగతి అలా ఉంచితే, ఇప్పటికే చెరువులో ఉన్న చేప పిల్లల పరిస్థితి ఏంటని తలలు పట్టుకోవాల్సి వస్తున్నది.
ఇతర చేపలను వెంటాడి వేటాడి తినేవే డెవిల్, క్యాట్ ఫిష్..
డెవిల్ ఫిష్, క్యాట్ ఫిష్ తినడానికి పనికి రావు. ఇవి నీటి వనరుల్లోని ఇతర చేప పిల్లలను కూడా తినేస్తాయి. పెద్ద చేపలను కూడా ఇవి వేటాడుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. అలాంటి ప్రమాదకరమైన డెవిల్, క్యాట్ ఫిష్ పిల్లలు ప్రభుత్వం ఉచితంగా విడుదల చేస్తున్న చేప పిల్లల్లో కలిసి వస్తున్నాయి. సోమవారం నల్లగొండ మండలంలోని మండలంలోని నర్సింగ్బట్ల, పాతూరు, చర్లపల్లి చెరువుల్లో మొత్తం 5.55 లక్షల చేప పిల్లలను వదలగా.. వాటిల్లో డెవిల్ ఫిష్, క్యాట్ ఫిష్ కలిస వచ్చాయి. కొందరు మత్స్యకారులకు కొన్నింటిని తీసి చంపేయగా, గుర్తించని వాళ్లు చెరువులో పోశారు. ఈ ఘటనపై చర్లపల్లిలో సొసైటీ అధ్యక్షుడిపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణకు దిగారు.
కైకలూరు నుంచి నల్లగొండకు..
నల్లగొండ జిల్లాలో టెండర్ వేసిన కాంట్రాక్టర్లు తమకు స్థానికంగా ఫిష్ సీడ్ ఫామ్స్ లేకపోవడంతో ఏపీలోని కైకలూరు నుంచి చేప పిల్లలను తీసుకొచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో జరిగిన టెండర్ల తర్వాత జిల్లాలో ఫిష్ సీడ్ ఫామ్స్ లేవని, చిన్నవి ఉన్నా అందులో సీడ్ సరిపోనూ లేదని మత్స్యశాఖ యంత్రాంగం టెండర్లు రద్దు చేసింది. కానీ, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఫిష్ సీడ్ లేకపోయినప్పటికీ వారికే ఫైనల్ చేయడం గమనార్హం.
దెయ్యం చేపలతో చాలా నష్టం
దెయ్యం(డెవిల్) చేపలు చెరువుల్లోని ఇతర చేప పిల్లలను చంపి తింటాయి. వాటి కారణంగా పోసిన చేప పిల్ల ల్లో 80 శాతం దాకా బతకడ ం కష్టమే. ఇలాంటి ప్రమాదకరమైన చేపలు తెచ్చి పోయడం మంచిది కాదు. మేము మొద ట గుర్తు పట్టలేక పోయాం. గుర్తు పట్టేలోపు అన్నీ చెరువులో పోశాం.
-మారయ్య, మత్స్యకారుడు,చర్లపల్లి