నల్లగొండ, జూలై 12 : నల్లగొండ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు 50 వేల ఎకరాలకు పెంచాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఉద్యాన శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని యుద్ధ ప్రాతిపాదికన 100 TPH (గంటకు వంద టన్నులు) సామర్ధ్యం గల ఫ్యాక్టరీ ఏర్పాటు ఆగస్టు మాసంలో ప్రారంభించాలని పతంజలి కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
ఆయిల్‌పామ్ పంట సాగుతో రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. ఒకసారి నాటితే 30 ఏండ్ల వరకు పంట దిగుబడి వస్తుందన్నారు. నీటి వసతి కలిగిన రైతులందరు ఆయిల్‌పామ్, ఇతర ఉద్యాన పంటల సాగు వైపు మళ్లాలని పిలపునిచ్చారు. ప్రభుత్వం ఈ పంటలకు భారీ రాయితీలు, మార్కెటింగ్ వసతి కల్పిస్తునందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి, పతంజలి డీజీఎం యాదగిరి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.