
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : ఈ నెల 10న జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రానికి ఒకటి చొప్పున పోలింగ్ బూత్ ఉండనుంది. ఆ డివిజన్ పరిధిలోని ఓటర్లంతా అక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. నల్లగొండ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మిర్యాలగూడలోని బకల్వాడ ప్రభుత్వ హైస్కూల్, దేవరకొండలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేటలోని ఎంపీడీఓ ఆఫీస్‌లోని స్త్రీ శక్తి భవనం, కోదాడలోని జడ్పీహెచ్ఎస్ బాలురు, హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, చౌటుప్పల్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఎంపీటీసీలకు ఎంపీడీఓ కార్యాలయాల నుంచి, జడ్పీటీసీలకు జిల్లా పరిషత్‌ల నుంచి, కౌన్సిలర్లకు మున్సిపల్ కార్యాలయాల నుంచి ఇప్పటికే ఫొటో ఐడీ కార్డులు జారీ చేశారు. ఓటు వేసేటప్పుడు ఆ కార్డు తప్పనిసరి కానుంది.
సిబ్బందికి శిక్షణ పూర్తి
పోలింగ్ విధుల కోసం మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రానికి ముగ్గురు చొప్పున విధుల్లో ఉంటారు. వీరు కాకుండా అదనంగా రిజర్వ్‌లో అంతే సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. వీరికి ఇప్పటికే పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. వీరికి పోలింగ్ ముందురోజు ఆయా జిల్లా కేంద్రాల్లో పోలింగ్ సామగ్రిని అందజేసి విధులను కేటాయిస్తారు. వీరితోపాటు పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రాన్ని ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. వీరితోపాటు సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది విధుల్లో ఉంటారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అనుసంధానిస్తారు. అన్నిచోట్ల వీడియో చిత్రీకరణ చేయనున్నారు.
ఏడుగురు అభ్యర్థులు..
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితోపాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్కు ఏకపక్ష బలం ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలేవీ పోటీకి ముందుకు రాలేదు. స్వతంత్ర అభ్యర్థులను తెరవెనుక నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నా.. వారీ ప్రభావం నామమాత్రమే. మొత్తం 1271 మంది ఓటర్లు ఉండగా నల్లగొండ జిల్లాలో 566 మంది, సూర్యాపేటలో 402, యాదాద్రిలో 303 మంది ఉన్నారు. వీరిలో 553 మంది మహిళా ఓటర్లు, 718 మంది పురుషులు ఉన్నారు. వీరిలో సుమారు వెయ్యి మందికి పైగా టీఆర్ఎస్కు సంబంధించిన వారే ఉండడంతో ఆ పార్టీ విజయం నల్లేరుపై నడకేనన్నది స్పష్టమవుతున్నది.
ఏర్పాట్ల్లు పరిశీలించిన అధికారులు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాల, దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను నల్లగొండ, దేవరకొండ ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, గోపీరాం, డీఎస్పీ ఆనందరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. పాటించాల్సిన నిబంధనలపై సూచనలిచ్చారు. వారి వెంట నల్లగొండ, దేవరకొండ తాసీల్దార్లు మందడి నాగార్జున్‌రెడ్డి, కిరణ్మయి, దేవరకొండ సీఐ బీసన్న, పలువురు అధికారులు ఉన్నారు.
పోలింగ్‌కు సహకరించాలి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయ్యింది. పోలింగ్ బాక్సులను సిద్ధం చేశాం. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా పెడుతున్నాం. అన్ని కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్లంతా ఫొటో గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి. పోలింగ్‌కు సహకరించాలి.