నందికొండ, నవంబర్ 10 : నాగార్జునసాగర్‌లోని ఎన్ఎస్పీ గృహాల్లో నివాసం ఉంటున్న వారికి అద్దె బకాయిలు చెల్లించాలని ఎన్ఎస్పీ అధికారులు శనివారం నోటీసుల ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లోని ఎన్ఎస్పీ గృహాలకు 58, 59 జీఓ కింద రిజిస్ట్రేషన్ పక్రియ చేపట్టింది. మొత్తం ఎన్ఎస్పీ క్వార్టర్స్ 1300 ఉండగా బీఆర్ఎస్ హయాంలో 600 ఇండ్లకు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అప్పట్లో ఎన్నికల రావడంతో మిగతా ఇండ్లకు కలెక్టర్ పరిధిలో అనుమతుల కోసం ఆగిపోయాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయి సంవత్సరం అవుతున్నా ప్రభుత్వం ఇండ్ల రిజిస్ట్రేషన్ పక్రియ చేపట్టలేదు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ అయిన వాటితోపాటు మిగిలిన ఇండ్లకు ఎన్ఎస్పీ అధికారులు అద్దె బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించారు.
ఎన్నికల సమయంలో ఇండ్లకు ఎటువంటి అద్దెలు చెల్లించనవసరం లేదని, ఇండ్లు సొంతం చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి రాగానే అద్దె చెల్లించాలని నోటీసులు పంపడం ఏమిటని స్థానికులు మండి పడుతున్నారు. నందికొండ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి, నందికొండలోని ఎన్ఎస్పీ ఇండ్లు, ఇతర ఆస్తుల లావాదేవిలను పూర్తిగా కలెక్టర్ పరిధిలోకి తీసుకున్నారు. ఎన్ఎస్పీ ఇండ్లకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులైన కలెక్టర్ పరిధిలో రావాల్సి ఉండగా, ఎన్ఎస్పీలో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇండ్ల కు అద్దె బకాయిలు పంపిచారని ఎన్ఎస్పీ రిటైర్డు ఉద్యోగులు అంటున్నారు. 60 సంవత్సరాలకు పైగా అయిన ఎన్నెస్పీ ఇండ్లు పూర్తి గా శిథిలావస్థలో చేరుకుంటే వాటికి లక్షల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేసుకుంటూ ఉంటున్నామని, 50 సంవత్సరాలుగా ఇండ్లలో ఉండే వారికి సొంతం చేయాలిగానీ, అద్దె చెల్లించాలని అడుగడం ఏమిట ని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.