నల్లగొండ, ఫిబ్రవరి 10 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ నెల 3నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ నెల 3 నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా సోమవారం ఒక్కరోజే 18 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 23 మంది అభ్యర్థులు 50 నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు.
చివరి రోజు 18 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థులుగా దామెర బాబురావు, కోమటిరెడ్డి గోపా ల్రెడ్డి, బండారు నాగరాజు, తాటికొండ వెంకటరాజయ్య, ఏలె చంద్రమోహన్, పన్నాల గోపాల్ రెడ్డి, పింగిలి శ్రీపాల్, గంగిరెడ్డి కోటిరెడ్డి, తండు ఉపేందర్, ఎస్.సుందర్ రాజ్, గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పూల రవీందర్, జెట్టి శంకర్, కొలిపాక వెంకటస్వామి, తలకోల పురుషోత్తం రెడ్డి, లింగిడి వెంకటేశ్వర్లు(ప్రజావాణి), పులి సరోత్తమ్ రెడ్డి(బీజేపీ), బండారు నాగరాజు(ప్రజా ఏక్తా పార్టీ) ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పూల రవీందర్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అనేక సమస్యలు పరిష్కరించానని, మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.
27న ఎన్నికలు
నామినేషన్ల స్క్రూటినీ మంగళవారం జరుగనుండగా, ఈ నెల 13న ఉపసంహరణ అనంతరం ఈ నెల 27న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 12 జిల్లాల్లో మొత్తం ఓటర్లు 25,797 మందికిగానూ సిద్దిపేటలో 166, జనగామ 1,002, హనుమకొండ 5,215, వరంగల్ 2,352, మహబూబాబాద్ 1,663, భూపాలపల్లి 329, ములుగు 628, భద్రాద్రి కొత్తగూడెం 2,022, ఖమ్మం 4,089, యాదాద్రి భువనగిరి 984, సూర్యాపేట 2,664, నల్లగొండలో 4683 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 15,783 మంది, స్త్రీలు 10,314 మంది ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఆర్వో ఇలా త్రిపాఠి తెలిపారు.