నేరేడుచర్ల, జనవరి 23 : నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబుపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్లు తీర్మానం చేయగా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం హుజూర్నగర్ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వర్లు సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉండగా వైస్ చైర్మన్ శ్రీలత తన పదవికి, కౌన్సిల్‌కు రాజీనామా చేశారు. మిగిలిన 14 మంది కౌన్సిలర్లలో చైర్మన్ జయబాబుతోపాటు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ షేరి సుభాశ్‌రెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. మిగతా 13 మంది కౌన్సిలర్లు హాజరై చేతులెత్తి మద్దతు తెలుపడంతో అవిశ్వాసం నెగ్గినట్లుగా ఆర్డీఓ ప్రకటించారు. కాగా, బీఆర్ఎస్ కౌన్సిలర్లకు జారీ చేసిన విప్ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ జయబాబు ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు. ఆ విషయంపై కలెక్టర్ చర్యలు తీసుకుంటారని, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, నేరేడుచర్ల ఎస్ఐ పరమేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఇదిలాఉండగా, మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్త అరిగెళ్ల రవి చేతిలో ప్రమాదవశాత్తు బాణాసంచా పేలి చేతి వేళ్లు నుజ్జునుజ్జయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.