యాదగిరిగుట్ట, జూన్ 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు లక్ష్మీనరసింహుల నిత్య కైంకర్యాలు పాంచరాత్రగమశాస్త్రం ప్రకారం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సుదర్శన నారసింహ హోమం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో సాగింది. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హవనం చేశారు.
వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవను చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చనలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి.
సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలతో శయనింపు చేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా కొనసాగింది. స్వామివారిని సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.16,55,653 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.యాదగిరిగుట్టలో ఘనంగా నిత్యార్చనలు