– కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి
కోదాడ, డిసెంబర్ 25 : నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 31 రాత్రి జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై వేడుకలు నిషేధించబడ్డాయని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులను క్షోభకు గురిచేయవద్దన్నారు. మద్యం దుకాణదారులు నిర్ణీత సమయం వరకే విక్రయాలు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డివిజన్లోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలుపుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యార్థులు, యువతకు ఆయన సూచించారు.