నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : న్యూఇయర్ వేడుకులు జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి అప్రశ్రుతులు, ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నది. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలంతా సామరస్య పూర్వకంగా వేడుకల్లో భాగస్వాములు కావాలని సూచిస్తోంది. న్యూఇయర్ వేడుకల్లో మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు నిర్ణీత సమయపాలనను విధిగా పాటించేలా ఆదేశాలిచ్చారు. ఈ నెల 31న రాత్రి 10గంటల నుంచి విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్‌లు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వేడుకల్లో మద్యం సేవించాక రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటి వాటిని అడ్డుకోవడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. అందుకే రోడ్లపై పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది.
పైగా సీసీ కెమెరాల ద్వారాను రోడ్లపై ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా యువత ట్రిబుల్ డ్రైవింగ్‌తో ర్యాష్‌గా వాహనాలు నడిపే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టనున్నారు. ఇలా పట్టుబడితే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వాహనాన్ని సైతం సీజ్ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు బైండోవర్ లాంటి చట్టపరమైన చర్యలకు ఆదేశాలిచ్చారు. ఇక ముఖ్య కూడళ్లతో పాటు ప్రధాన రహదారులపై మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిరంతరం క్షేత్రస్థాయిలో కన్నేసి ఉండనున్నారు. ఆరు బయట మద్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరగడం, మహిళల పట్ల అసభ్య ప్రవర్తించడం లాంటివి వాటిపై వీరు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. యువతపై తల్లిదండ్రులు సైతం ఓ కన్నేసి ఉంచాలని, మద్యం ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
వేడుకల్లో ఆర్కెస్ట్రా, డీజేలు, మైకులు పెట్టి పెద్ద సౌండ్స్ సిస్టంలకు అనుమతి ఇవ్వడం లేదు. బాణసంచా కాల్చడానికి సైతం పోలీసులు నో చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇక న్యూఇయర్‌ను ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులు, హోటళ్లు, బేకరీ, స్వీట్ షాపుల యజమానులు అధిక ధరలకు విక్రయాలు చేయకూడాదని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 31న రాత్రి వేడుకలు ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవడమే తమ లక్ష్యమని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి ప్రకటించారు. వేడుకులను సంతోషంగా జరుపుకోవడానికి ప్రజలంతా సహకరిస్తూ కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికాలని పిలుపునిచ్చారు. ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా యువత మితిమీరి వ్యవహరించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు. న్యూఇయర్ వేడుకల్లో అన్ని ప్రధానమైన కూడళ్లతో పాటు, రహదారులపైనా నిఘా కొనసాగుతుందన్నారు.