అడవిదేవులపల్లి, సెప్టెంబర్ 24 : తమ పట్టా భూములను బ్లాక్ లిస్ట్ నుండి తొలగించి, క్రయ, విక్రయాలకు ఇబ్బందులు లేకుండా పట్టాలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తూ అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామ వాసులు బుధవారం నల్లగొండ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. తమ సొంతూరు నందికొండ అని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపునకు గురికాగా నిర్వాసితులమైన తమకు ప్రభుత్వం అడవిదేవులపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేయగా కొత్త నందికొండ గ్రామంగా తామంతా అక్కడ స్థిరపడినట్లు తెలిపారు. ఆ రోజు తమ తాతలకు 20-30 ఎకరాల వ్యవసాయ భూములు, బర్రెలు, గొర్రెలు, ఎద్దులు ఉన్నా ప్రభుత్వం ఆనాడు కుటుంబానికి 5 ఎకరాల భూమి (ఢీ ఫామ్), 4 గుంటల ఇంటి జాగా మాత్రమే ఇచ్చిందని చెప్పారు.
అందులోనే 50 ఏండ్లుగా కబ్జాలో ఉంటూ వ్యవసాయంలో లాభం లేకపోయినప్పటికీ అదే జీవనాధారంగా బతుకుతున్నట్లు వెల్లడించారు. అయితే గత కొన్నేండ్లుగా ప్రభుత్వం తమ భూములను బ్లాక్ లిస్ట్‌లో చేర్చిందని, ప్రభుత్వ చర్యతో భూముల క్రయ విక్రయాలు బంద్ అయినట్లు తెలిపారు. దీంతో జబ్బు చేస్తే చికిత్స చేయించుకోవడానికైనా, ఆడపిల్ల పెండ్లి అయినా, పిల్లల చదువులకైనా, ఏ కష్టం, ఆపదొచ్చినా ఉన్న కాస్త భూమిని ఆసరాగా చేసుకుని తెరిపిన పడుదామంటే పట్టాలు కాకపాయేసరికి కొనుగోలుదారులెవరూ ముందుకు రావడం లేదన్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్‌కు తమ భూములిచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం తమకు కన్నీళ్లే మిగిల్చిందన్నారు.
డీ ఫామ్ పట్టాలు, కాసరా పహాణీ, అన్ని ఒరిజినల్ పత్రాలు ఉన్నా పట్టాలు ఎందుకు కావడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలు, తాసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్, గ్రామ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు, ఆఖరికి సీసీఎల్‌లో ఫిర్యాదు చేసి విన్నవించినప్పటికీ తమ సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదన్నారు. నేడు కొద్ది మందిమి మాత్రమే వచ్చామని, రేపు గ్రామం మొత్తం కలెక్టరేట్‌కు రానున్నట్లు తెలిపారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కలెక్టరేట్ వద్దే స్నానాలు, భోజనాలు, వంటా వార్పుతో తమ ఆందోళనను కొనసాగించనున్నట్లు, పట్టాలు వచ్చుడో.. తాము సచ్చుడో అని పేర్కొన్నారు.