రామగిరి, జూన్ 21: దేశ వ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్-2026’ పరీక్ష ఆదివారం జిల్లా కేంద్రమైన నల్లగొండలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయం త్రం 5.15 గంటల వరకు జరిగిన పరీక్షకు విద్యార్థులను ముందస్తుగా అనుమతించడం తో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుం డా ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పిల్చుకున్నారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన 7 పరీక్ష కేంద్రాల్లో 2065 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1782 మంది మాత్రమే హాజరయ్యారు. 283 మంది గైర్హాజరయ్యారు. ఈ పర్యాయం అత్యధిక సంఖ్య లో విద్యార్థులు గైర్హాజరయ్యారు. యూనివర్సిటీలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వర్సిటీ వెలుపల వాహనాలు, విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుంచి లోపల ఉన్న పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు వెళ్లేందుకు ఈ పర్యాయం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ
పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్చార్జి, అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, నీట్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ఏఎస్పీ రమేష్, డీఆర్వో నాయక్‌తోపాటు పలువు అధికారులు తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్లతోపాటు అధికారులకు పలు సూచనలు చేశారు. దీంతో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరుగకుండా నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగింది.
283 మంది విద్యార్థులు గైర్హాజర్..
ఎన్జీ కళాశాల, ఉమెన్స్ కళాశాల, ఎంజీయూ ఇంజినీరింగ్, ఎంజీయూ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, ఎంజీయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంజీయూ సైన్స్ కళాశాలలతోపాటు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన పరీక్షలకు 2065 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1782 మంది మాత్రమే హాజరయ్యారు. 283 విద్యార్థులు గైర్హాజరయ్యారు. గత నెల 3న నిర్వహించిన పరీక్షకు జిల్లాలో 2038 మంది హాజరు కావాల్సి ఉండగా 1985 మంది హాజరయ్యారు. 53 మంది గైర్హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ నరసింహ
సూర్యాపేట అర్బన్ జూన్ 21 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, బందోబస్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష అనంతరం ప్రశ్నా పత్రాల తరలింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తగిన సలహలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. అంతకుముందు పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లు పరిశీలించి బయో మెట్రిక్ పూర్తయిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను ఇన్విజిలేటర్లు వారి రూమ్ నెంబర్స్ ప్రకారం క్యూలో పంపించారు. ఎటువంటి సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.