మర్రిగూడ, ఫిబ్రవరి 6 : మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం బాధితులను ఖాళీ చేయించేందుకు ప్రాజెక్టు కాంట్రాక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు కలిసి గ్రామస్తులపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఇండ్లను ఖాళీ చేయాలని ప్రాజెక్టు యాజమాన్యం, అధికారులు గురువారం గ్రామానికి ట్రాక్టర్లు పంపించడంతో ప్లాట్లు, పరిహారం అందని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పనులు జరుగుతున్న ప్రాజెక్టు కట్ట దగ్గరికి వెళ్లి టిప్పర్లను అడ్డుకొని పనులు నిలుపుదల చేశారు. కట్టపై బైఠాయించి ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా మంపు బాధితులు మాట్లాడుతూ ఈ నెల 10వరకు గ్రామాన్ని ఖాళీ చేయించేలా అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నన్నారని తెలిపారు. అందులో భాగంగానే రాత్రిపూట విద్యుత్ స్తంభాలను కూల్చేసి భయాందోళన సృష్టించారని చెప్పా రు. గ్రామాన్ని ఖాళీ చేసిన వారికి కాంట్రాక్టర్‌తో మాట్లాడి నజరానా కూడా ఇప్పిస్తామని అధికారులు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తుల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా కట్రలు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వస్వం కోల్పోతున్న భూ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
కనీసం నోటీసులు కూడా ఇవ్వకుం డా అధికారులు గ్రామంలోకి ట్రాక్టర్లను పంపి ఖాళీ చేయమనడం ఎం త వరకు కరెక్టు అని ప్రశ్నించారు. ఖాళీ చేయించే సమయంలో ప్రభు త్వ అధికారులు ఎందుకు గ్రామానికి రాలేదని నిలదీశారు. మిగిలిన నిర్వాసితులకు ప్లాట్లు, ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులను భయపెడుతూ గ్రామాన్ని ఖాళీ చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
గ్రామస్తులను ఎలాగైనా ఖాళీ చేయించాలనే కుట్రతో అధికారులు, ప్రాజెక్టు యాజమాన్యంతో కుమ్మక్కైనట్లు బాధితులు ఆరోపించారు. 6న గ్రామాన్ని ఖాళీ చేసిన కుటుంబానికి రూ.30వేలు, 10లోపు ఖాళీ చేస్తే రూ.20వేల చొప్పున ఇప్పిస్తామని ఇరిగేషన్ అధికారులు ప్రలోభపెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. 10తర్వాత ఖాళీ చేసిన వారికి పైసా కూడా ఇవ్వబోమని, వారితో తమకెలాంటి సంబం ధం లేదని చెప్పినట్లు వెల్లడించారు. వారి మాటలు విన్న కొందరు బాధితులు గ్రామాన్ని ఖాళీ చేయగా, మిగతావారు ఖాళీ చేసేది లేదని తేల్చిచెప్పారు.
ఈ విషయమై ఇరిగేషన్ శాఖ ఈఈ రాములును వివరణ కోరగా 2021 మే 21లోగా గ్రామంలో డీఎల్ఐఎస్ నంబ ర్ పొందిన ముంపు బాధితుందరికీ ప్లాట్లు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందుతాయన్నారు. నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మిగతా 32మందికి కూడా ప్లాట్లు ఇస్తామని తెలిపారు. ప్లాట్లు కేటాయించిన వారికి త్వరలోనే మంజూరు పత్రాలు అందిస్తామన్నారు. గ్రామాన్ని ఖాళీ చేయించేలా ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని, ప్లాట్లు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వచ్చిన వాళ్లు మాత్రమే ఇండ్లను ఖాళీ చేస్తున్నారని చెప్పారు.
గ్రామంలోని 289 ముంపు బాధితులకుగానూ చింతపల్లి మండలంలో లాటరీ ద్వారా 257 మందికి ప్లాట్లు కేటాయించారు. ఇంకా 32 మందికి ప్లాట్లు రాలేదని, ఇంకో 15మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందాల్సి ఉంద ని బాధితులు వాపోయారు. అధికారులు ప్లాట్లను మాత్రమే కేటాయిం చి చేతులు దులుపుకొన్నారని, వాటి కి సంబంధించి డాక్యుమెంట్లు ఇవ్వలేదంటున్నారు. పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకుండా గ్రా మాన్ని ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు మండిపడ్డారు.