నల్లగొండ విద్యా విభాగం(రామగిరి), ఏప్రిల్ 5 : నల్లగొండ పట్టణానికి చెందిన మూడో తరగతి విద్యార్థిని పబ్బత్రెడ్డి నిత్యా రెడ్డి ”రాష్ట్రస్థాయి గణిత ఎక్సలెంట్ విద్యార్థి అవార్డు” అందుకుంది. స్వమేధ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మేకిన్ ఇండియాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు గణిత అంశాలపై పోటీ పరీక్ష నిర్వహించారు. ఇందులో నల్లగొండలోని అరబిందో పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న నిత్యారెడ్డి ప్రతిభ చూపి ప్రథమ బహుమతి సాధించింది. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో శనివారం నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో నిత్యారెడ్డికి రూ.2,500 నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, మెమొంటోను రాష్ట్ర విద్య శిక్షణ పరిశోధనా సంస్థ (SCERT) ప్రొఫెసర్ మంగారెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్యలోనే విద్యార్థులకు గణితంపై అవగాహన పెంపొందించాలన్నారు. గణితంలో పట్టు సాధించడంతో విద్యార్థులకు జీవితంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వమేథ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు రవికుమార్ నడింపల్లి, విద్యార్థిని తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి, స్వాతి పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ మర్రెడ్డి రమణ, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందనలు తెలిపారు.