నీలగిరి, ఏప్రిల్ 22 : నల్లగొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. విజిలెన్స్ సిఐ దశరథ మనోజ్ కుమార్ నేతృత్వంలో సోదాలు చేపట్టారు. ప్రభుత్వం నుండి, రిజిస్ట్రేషన్ శాఖ నుండి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు సిబ్బందిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కాగా నలుగురు పురుషులు ఉన్నారు. వీరిని విజిలెన్స్ కార్యాలయానికి తరలించి వ్యక్తిగతంగా అందరిని వేర్వేరుగా విచారణ చేస్తున్నారు. ఎంతకాలం నుండి పని చేస్తున్నారు, ఎంత వేతనం పొందుతున్నారు, ఆ వేతనం ఎక్కడి నుండి వస్తుంది అనే విషయాలపై విచారణ చేపట్టారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల నుండి చేసిన రిజిస్ట్రేషన్ లపై డాక్యుమెంట్ వారిగా రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నర్సింహారెడ్డి, వెంకన్న, పాషా పాల్గొన్నారు.