హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ భారీ కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ప్రత్యేక ఆహ్వానితుడు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సమక్షంలో బాబా సాహెబ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. మహాద్భుత వేడుకను కళ్లారా వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రాగా ఉమ్మడి నల్లగొండ నుంచి నియోజకవర్గానికి 300 మంది చొప్పున 3,600 మంది ఆహ్వానితులుగా తరలివెళ్లారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వమే ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. మండలాల నుంచి వెళ్లే బస్సులను నేతలు జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తోపాటు వేదికపై ఆసీనులు కాగా జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. వీరితోపాటు ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల ముఖ్యులు, మేధావులు, ఇతర ప్రముఖులు సైతం స్వచ్ఛందంగా అక్కడికి చేరుకున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ) : హైదరబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇది విగ్రహం కాదు… విప్లవం మంటూ సాగిన ఈ ఘట్టంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 3600 మంది భాగస్వాములయ్యారు. వీరితో పాటు ప్రజాప్రతినిధులు, నేతలు, దళిత సంఘాల ముఖ్యులు, మేధావులు, ఇతర ప్రముఖులు సైతం స్వచ్ఛందంగా తరలివెళ్లారు. ముందుగా జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను వాడవాడలా నిర్వహించారు. పల్లె పట్నం తేడా లేకుండా వెల్లువలా ఉత్సవాలు కొనసాగాయి. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల ప్రముఖులంతా అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేద్కర్ జయంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన విగ్రహావిష్కరణకు బయల్దేరి వెళ్లారు. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో 50 మందికి తగ్గకుండా వెళ్లారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో రవాణా, భోజనం, ఇతర వసతులు కల్పించారు. జిల్లా నుంచి వెళ్లి వారంతా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. నిత్యం అంబేద్కర్ స్ఫూర్తిని రగిలించేలా సచివాలయం ఎదురుగా అంతెత్తున విగ్రహాన్ని నిర్మించినట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై జిల్లా వాసులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో తమను భాగస్వాములను చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కడా లోటుపాట్లు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భారీ అంబేద్కర్ విగ్రహం ఎదుట పెద్ద సంఖ్యలో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు సైతం ఫొటోలు తీసుకోవడం విశేషం.