గుండాల, జూలై 13 : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులతో కళ కళలాడుతున్నది. ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్య అందిస్తుండడంతో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. పాఠశాలలో గతేడాది 154 మంది ఉండగా… ఈ విద్యాసంవత్సరం 57 మంది కొత్తగా చేరడంతో విద్యార్థుల సంఖ్య 211కు చేరింది.
ఉత్తమ విద్య
కస్తూర్బా పాఠశాలలో 6 నుంచి 10వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. వారి కోసం మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఉత్తమ విద్య అందిస్తున్నారు. 20 మంది టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యా
ర్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి సజ్జెక్టులో మంచి మార్కులు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధిస్తున్నారు.
మెనూ ప్రకారం భోజనం
పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు. ఉదయం రాగిజావాతోపాటుగా ఇడ్లీ, ఉప్మా, పూరి వంటి టిఫిన్లు, మధ్యాహ్నం కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, సాంబర్తో కూడిన భోజనం, గుడ్డు, సాయంత్రం స్నాక్స్, రాత్రి కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, సాంబర్, మజ్జిగతో కూడిన భోజనం పెడుతున్నారు. ప్రతి ఆదివారం చికెన్‌తో భోజనం అందిస్తున్నారు.
క్రీడల్లో శిక్షణ
విద్యార్థినులకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయాన్నే యోగాతోపాటు ఆత్మరక్షణకు కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. అన్ని రకాల క్రీడల్లో శిక్షణ ఇచ్చి వివిధ పోటీలకు సైతం తీసుకెళ్తున్నారు. గతేడాది జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.
ఆరోగ్యంపై శ్రద్ధ
విద్యార్థినుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఆరోగ్యంపై ఏఎన్ఎం నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు విద్యార్థినులను పరీక్షించి అవసరమైన మందులు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే హైజీనిక్ కిట్లు అందిస్తున్నాం.
క్రీడల్లో రాణించేలా ప్రోత్సాహం
విద్యార్థినులు క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నాం. యోగాతోపాటుగా ఆత్మరక్షణకు కరాటే నేర్పిస్తున్నాం. రోజుకో పీరియడ్‌ను క్రీడలకు కేటాయిస్తున్నాం. క్రీడల్లో రాణించే విద్యార్థినులను ప్రోత్సహించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించేలా శిక్షణ ఇస్తున్నాం. -శ్రీలత, పీఈటీ
మెరుగైన వసతులు కల్పిస్తున్నాం
విద్యార్థినులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదివేలా చొరవ తీసుకుంటున్నాం. మంచి వాతావరణంలో విద్యా బోధన చేస్తున్నాం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నాం. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. -విజయలక్ష్మి, ప్రత్యేకాధికారి