నల్లగొండ, నవంబర్ 14 : నార్కట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం సమీపంలో గల శ్రీవల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణాల భౌతిక వేలం కలెక్టరేట్లో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు ఓపెన్ వేలంలో పాల్గొని ప్లాట్లు, పాక్షిక గృహాలను దక్కించుకున్నారు. ఈ వెంచర్లో 229ఓపెన్ ప్లాట్లు, 355 పాక్షిక నిర్మాణ గృహాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 17వరకు భౌతిక వేలం నిర్వహించనున్నందున ఔత్సాహికులు కలెక్టర్ పేరు మీద రూ.10వేలు డీడీ తీసి వేలంలో పాల్గొనాలని సూచించారు. ఓపెన్ ప్లాట్ల అప్సెట్ ధర గజం రూ.6వేలు నిర్ణయించగా పాక్షిక నిర్మాణ గృహాల అప్సెట్ ధర రూ.10,500గా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ మూడు రోజుల్లో పాల్గొనాలని సూచించారు. అదనపు వివరాల కోసం 9154339209 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
వెంచర్లో ప్రభుత్వమే అన్ని రోడ్లు నిర్మించి అక్కడ మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ వెంచర్‌పై అవగాహన వచ్చేందుకు మున్సిపల్ యంత్రాంగం అన్ని వార్డుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మూడోసారి నిర్వహించిన ఈ వేలంలో సోమవారం ప్రభుత్వానికి రూ.1.60 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు.