నార్కట్పల్లి, నవంబర్ 11 : పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ గ్రామాలను పచ్చటి తోరణంలా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఫలిస్తున్నది. గతేడాది హరితహారంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను నాటి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగి ఫలాలనిస్తున్నాయి.
పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా రోజురోజుకూ పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతేడాది మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో జామ, దానిమ్మ, అల్లనేరేడు, మామిడి, సపోట, ఉసిరి, సీతాఫలం తదితర పండ్ల మొక్కలను నాటారు.
అలాగే వివిధ రకాల పూల మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టారు. ఎండకాలంలో మొక్కలు ఎండిపోకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది నీళ్లు పెడుతున్నారు. పశువులు మేయకుండా ప్రకృతి వనాల చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రకృతివనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని ఇవ్వడంతోపాటు కాయలు కాస్తున్నాయి. మండలంలో అన్ని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పల్లెపకృతి వనాలను ఏర్పాటు చేసి వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను నాటించామని ఎంపీడీఓ యాదగిరి తెలిపారు. సంరక్షణ చర్యలు చేపట్టడంతో కాయలు కాస్తున్నాయని చెప్పారు.
గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తున్నాయి. జామ, దానిమ్మ, అల్లనేరేడు, మామిడి, సపోట, ఉసిరి, సీతాఫలం వంటి మొక్కలు నాటాం. మొక్కలు ఏపుగా పెరుగడంతో ప్రకృతివనాలు పల్లెలకు కొత్త అందాన్ని తీసుకువచ్చాయి.
– మేడి పుష్పలత, ఎల్లారెడ్డిగూడెం సర్పంచ్