భువనగిరికలెక్టరేట్, నవంబర్ 9 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శాఖాపరమైన సమాచారం, గణాంక వివరాల నమోదు కోసం పూర్తి స్థాయిలో నిర్ణీత ప్రొఫార్మాను వచ్చే సోమవారం లోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో గణాంక పుస్తక వివరాల సేకరణ కమిటీ సమావేశానికి బుధవారం ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్రంలో ఒకే విధమైన ప్రొఫార్మాతో కూడిన గణాంక వివరాలు ఉండేందుకు వీలుగా నిర్ణీత ప్రొఫార్మాను పొందుపర్చనున్నట్లు తెలిపారు. అందుకోసం శాఖాపరమైన పూర్తి సమగ్ర వివరాల ప్రొఫార్మా సమర్పించాలని అధికారులకు సూచించారు.
గణాంక వివరాలతో కూడిన చేతి పుస్తకాలు పబ్లిక్ సర్వీస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు, రీసెర్చ్ స్కాలర్లకు, ఎన్జీఓలకు, ప్లానర్స్‌కు సైతం ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రొఫార్మా తయారీలో ఏమైనా మార్పులు ఉంటే సూచించాలని, ప్రొఫార్మాను సిద్ధం చేసి గణాంక పుస్తక వివరాల సేకరణ కమిటీ కన్వీనర్, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి భూక్యా మాన్యానాయక్కు అందించాలన్నారు.
సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పి.యాదయ్య, జైపాల్‌రెడ్డి, సత్యనారాయణ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి ఎం.నాగేశ్వరాచారి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మదన్మోహన్, మిషన్ కాకతీయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నర్సింహ, మిషన్ భగీరథ డీఏఓ నాగేశ్వర్రావు, జిల్లా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరామోజు నీలిమ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ముంపునకు గురవుతున్న యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్‌తండా వాసులకు నెల రోజుల్లో లే అవుట్ పూర్తి చేసి దాతరుపల్లి గ్రామంలోని 294 సర్వే నంబర్లో లేఅవుట్ చేసి అందిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం లప్పానాయక్‌తండా వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తండావాసులు తమ సమస్యలకు సంబంధించిన పత్రాన్ని అదనపు కలెక్టర్‌కు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండావాసులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాతరుపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన 294 సర్వే నంబర్లో తండావాసులు కోరినట్లుగా అన్ని సదుపాయాలతో పునారావసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాంతో తాత్కాలికంగా దీక్ష విరమిస్తున్నట్లు తండావాసులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.