మునుగోడు నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, అక్టోబర్ 30 : సినిమా స్టెప్పులు షోకేస్‌లో బొమ్మలాంటివైతే.. జానపదాలు జీవితంలాంటివి అంటున్నారు ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్. మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం మునుగోడులో తిరుగుతున్న పల్లెల్లో ప్రయాణం అమ్మతో ప్రయాణం చేసినట్లుగా ఉందని మైమరచిపోతున్నారు. మునుగోడు బహిరంగ సభకు వచ్చి, ఎర్రజెండా ఎత్తి కళాకారులతో కలిసి ఆడిపాడుతున్న రాకేశ్ మాస్టర్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ ఎన్నికల రాజకీయాల గురించి చెప్పినమైన ముచ్చట్లెన్నో చెప్పారిలా…
‘నేను సీపీఎం తరపున మునుగోడు ప్రాంతంలో ప్రచారానికి వచ్చాను. ఆలేటి ఆటం అన్నయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి నర్సింహ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. రోజూ గ్రామాల్లో తిరుగుతున్నాను. కమ్యూనిస్టులు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిపించాలని చెబుతున్నాను. కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలకు చెబుతున్నాను. జానపదాలు పాడటం, జాన పదాలకు ఆడటం సినిమా స్టెప్పల్లాంటివి కావు. అవి షోకోస్లో బొమ్మలాంటివి. వాటికి ప్రాణం లేదు. జానపదాలకు జీవితంలాంటివి. తినే అన్నం మట్టి నుంచి వస్తుంది. అన్నం పెట్టే మట్టిని మర్చిపోయినవాడు మనిషి కాదు. మట్టితో ఉన్న వాళ్లతోనే నా ప్రయాణం. చిన్నప్పటి నుంచి నా ప్రయాణం ఇలాగే మొదలైంది. ఇప్పటి వరకు ఇలాగే సాగింది. శవాల దగ్గర కూడా డ్యాన్స్ చేశాను.
నాకు రాజకీయాలంటే ఇష్ట ంలేదు. కానీ సేవ మాత్రమే నచ్చుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఎర్ర జెండా అంటే ఇష్టం. సీపీఎం పార్టీ అంటే ప్రేమ. మా నాన్నగారు శీనూరి బాల్‌రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య అనుచరుడు. సీపీఎం నా గుండెకాయ. అందుకే టీఆర్ఎస్ కోసం ప్రచారం చేస్తున్నాను. మా సోదరుడు ఆలేటి ఆటం అన్న, ప్రజా నాట్యమండలి నర్సింహ పిలిస్తే వచ్చాను.
నేను ఇక్కడి ప్రచారానికి రూపాయి తీసుకోలేదు. ఖర్చులు కూడా సొంతంగా పెట్టుకుని తిరుగుతున్నాను. గతంలో ఎన్నికలకు ప్రచారానికి వస్తే అయిదు లక్షలు ఇస్తామని కొంతమంది లీడర్లు పిలిచారు. చెప్పుతో కొడతానని సమాధానం చెప్పినా. మళ్లీ వచ్చి అడగలేదు. మా నాన్న (శీనూరి బాల్ రెడ్డి) పుచ్చలపల్లి సుందరయ్య అనుచరుడు. చిన్నప్పటి నుంచి నాకు ఎర్రజెండా అంటే ప్రేమ. మా సీపీఎం పార్టీ మద్దతు ఇస్తోంది. కాబట్టి నేను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఓటేయమని చెబుతాను. నేను సీపీఎంని ప్రేమిస్తాను. అది చెప్పిందే పాటిస్తాను.
రాజకీయాల కోసం రాలేదు. రాజకీయ నాయకుడు అనేది నా దృష్టిలో తప్పు. కేసీఆర్ ప్రజా సేవకుడు కాబట్టే వచ్చాను. రాజకీయ నాయకులను నేను లెక్క చేయను. ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకులను మాత్రమే గౌరవిస్తాను.
ప్రజలతో ఉండాలని ఈ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చాను. కానీ, రాజకీయాలు చేయాలని, రాజకీయ నాయకుడు కావాలని రాలేదు. నేను ప్రజల మనిషిని. నా గోత్రం ప్రజా గోత్రం. జనం మనం..మనం జనం.. ప్రభంజనమని తెలుసుకుని ప్రజల నాడి పట్టుకుని (ప్రజల్లో) ప్రచారంలో తిరుగుతున్నాను. ప్రముఖ వ్యక్తులతో స్నేహాల కంటే మట్టి మనిషులతో కలిసి తిరగడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. మునుగోడు పల్లెల్లో తిరుగుతుంటే అమ్మతో కలిసి ప్రయాణం చేస్తున్నట్టుంది.