యాదాద్రి, అక్టోబర్ 30 : యాదాద్రీశుడి దివ్యక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. కార్తికమాసం మొదటి ఆదివారం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొంది. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి, లక్ష్మి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది.
స్వామివారి ధర్మ దర్శనానికి 6 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు జరిగే సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు.
తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహహోమం జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు వైభవంగా కొనసాగాయి.
యాదాద్రి ఆలయ ప్రాంగణంలో కార్తికమాస పూజలు వైభవంగా కొనసాగాయి. కొండకింద వ్రత మండపంతో పాటు, పాతగుట్ట ఆలయ ప్రాంగణంలో వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రికార్డుస్థాయిలో సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 దఫాలుగా వ్రతాలు నిర్వహించారు. 734 మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్తిక దీపారాధనలో మహిళలు పాల్గొన్నారు. ప్రధానాలయ, శివాలయ మాఢ వీధులు, వ్రత మండపం, లక్ష్మీపుష్కరిణి వద్ద దీపారాధన మండపంలో మహిళలు దీపాలు వెలిగించి మొక్కు లు చెల్లించుకున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామి వారిని సుమారు 45 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.52,17,063 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్. గీత తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 5,09,150
వీఐపీ దర్శనాలు 6,00,000
వేద ఆశీర్వచనం 13,800
నిత్య కైంకర్యాలు 10,732
సుప్రభాతం 3,300
ప్రచార శాఖ 66,750
వ్రత పూజలు 5,87,200
కల్యాణకట్ట టిక్కెట్లు 1,32,500
ప్రసాద విక్రయం 20,36,900
వాహన పూజలు 24,100
అన్నదాన విరాళం 1,27,781
శాశ్వత పూజలు 5,000
సువర్ణ పుష్పార్చన 2,05,412
యాదరుషి నిలయం 1,02,148
పాతగుట్ట నుంచి 1,30,190
కొండపైకి వాహన ప్రవేశం 6,50,000
శివాలయం 12,100