మెరిసేదంతా బంగారం కాదన్నట్టు.. ‘కృష్ణా జలాలు’ అని రాసిన ట్యాంకుల్లో వచ్చేవన్నీ కృష్ణా నీళ్లు కావు! పథకానికీ, ప్రయోజనానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేదీ తండాల్లో! ‘ఈ విషపు నీళ్లు తాగీ తాగీ ప్రాణాలు పోతున్నయ్. రోజుకో బిందెడు మంచి నీళ్లు ఇయ్యండయ్యా’ ఎన్ని సార్లు వినతి పత్రాలిచ్చారో. ఎన్ని ధర్నాలు చేశారో. ఎంతమంది నేతల కాళ్లు మొక్కారో. పది రోజులకో, పక్షానికో వచ్చే బిందెడు నీళ్లు దక్కాలంటే ఎంత తండ్లాటో? ‘ఈ బాధలు బాపి, మంచినీళ్లిచ్చిన మా బాపు మన కేసీఆర్ సారు. తండా తండాకీ ట్యాంకు. ఇంటింటికీ నల్లా… మంచినీళ్ల బాధలుపోయినంక మా తండాలకు మంచి రోజులొచ్చినయ్’ అంటున్నరు సంస్థాన్ నారాయణపురం మండలంలోని లంబాడీలు. ‘కృష్ణా నీళ్లు కావాలని అడిగితే.. ఇస్తున్నాంగా, తండా తండాకి ట్యాంక్ కట్టినం, నల్లా పెట్టినమని సార్లు చెప్పేటోళ్లు. ఆ ఉల్టా మాటలేందో మాకు అర్థం కాకపోయేది’ అని సంస్థాన్ నారాయణపురం మండలంలోని తండా మహిళలు ఒకప్పటి మంచినీళ్ల సమస్యను గుర్తు చేస్తున్నరు. ‘గవర్నమెంటు సార్లు.. నీళ్లిస్తమంటున్నరు. ఈ ట్యాంకుల్ల వచ్చేది బోరు నీళ్లే, కృష్ణా నీళ్లు కాద’ని తండా జనం మొత్తుకునేది. లంబాడోళ్లు మాట్లాడేది రోజూ ట్యాంకుల్లో పట్టుకుంటున్న నీళ్ల గురించి. అధికారులు చెప్పేది ఆ ట్యాంక్ మీద ఉన్న పేర్ల గురించి! ట్యాంక్ మీద ‘కృష్ణా జలాలు’ అని రాసి ఉంటదే కానీ, నింపేది బోరు నీళ్లేనని తండా పెద్దలే కాదు పిల్లలూ చెబుతున్నారు. కృష్ణా నీళ్లిచ్చి ఫ్లోరైడ్ బాధలు పోగొడుతమని చెప్పింది నిజమే. ట్యాంకుల కట్టారు. తండా తండాకీ పైపులేశారు. కానీ రోజూ నీళ్లియ్యడం మాత్రం అబద్దం. ఒకప్పుడు… వారానికో, పది రోజులకో, పక్షానికో ఓసారి మాత్రమే కృష్ణా నీళ్లిచ్చేదని తండా ప్రజలు చెబుతున్నారు. అప్పుడా నీళ్లు ముందున్నోడికి అందేది. వెనకున్నోడికి ఎండేది. ఇట్ల నీళ్లు దక్కట్లేదని తండాల జనమంతా బిందెల ప్రదర్శనతో నారాయణపురానికి తరలిపోయేది. సారూ.. పథకాల పేర్లు కాదు సారూ.. పథకాలు, శిలా ఫలకాలు, ప్రారంభోత్సవాలు కాదు బిందెడు నీళ్లు కావాలె. కాళ్లు గుంజుతున్నయ్. కాళ్లూ చేతులు వంకర్లు పోయి మూలనపడుతున్నరు. మమ్మల్ని పట్టించుకోండని అధికారుల్ని వేడుకున్నరు. ‘నీళ్లిస్త్తనని ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతలయినయ్. అయిదు దశాబ్దాలు పోరాటాలతోనే గడిచిపోయింది.
అప్పట్లో వారం, పదిరోజులకు ఒకసారి వచ్చే కృష్ణా నీళ్లను బకెట్లలో, డ్రమ్ముల్లో దాచుకుని తాగడం వల్ల ఆరోగ్యం పాడయ్యేదని, ఏరోజుకారోజు ఇవ్వమంటే ఇవ్వలేదని తండాల పెద్దలు చెబుతున్నరు. కృష్ణా నీళ్లు రాక, ఫ్లోరైడ్ బాధ పోక చానా బాధలుపడ్డామని ఏ తండాకు పోయినా చెబుతున్నరు. ఈ నీళ్ల వల్ల పెద్దలకు ఒళ్లు నొప్పలు, పిల్లలకు పండ్లపై చారలు వచ్చేదని చెబుతున్నరు. ట్యాంకులకు వచ్చే కృష్ణానీళ్లు సరిపోక బోర్లు వేయించుకుని అదే ట్యాంకుని నింపుకొన్నమని తండా ప్రజలు చెబుతున్నరు. వానల్లేక ఆ బోర్లు కూడా ఎండిపోతే చేలకు పోయి, అక్కడున్న బావుల నుంచి బిందెలతో మంచినీళ్లు తెచ్చుకున్నరు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో.. అప్పుడొచ్చింది భగీరథ ట్యాంకు. ఆ ట్యాంకు వచ్చినంక మా తండాలో ట్యాంకు కాడ లైను కట్టే బాధ పోయింది. ఇంటింటికీ నీళ్లొచ్చినంక విషపు నీళ్ల పీడ విరగడయిందని కరంటోతు పుల్చా చెబుతున్నడు. తాగడానికి కావాల్సినన్ని నీళ్లొచ్చినంక మా బాధలు తీరినయని చెబుతున్నరు. వాచ్యాతండా, మర్రిబాయి తండా, పొర్లగడ్డ, సీత్యా తండా, డాకు తండా, రాధానగర్ తండా, కొర్ర తండా చుట్టు పక్కల ఉన్న మొత్తం 17 తండాల దాహం తీర్చింది మిషన్ భగీరథ. కేసీఆర్ వచ్చినప్పటి నుంచే ఈ తండాలకు కావాల్సినన్ని మంచి నీళ్లు వస్తున్నాయని లంబాడీలు చెబుతున్నారు. మిషన్ భగీరథ వచ్చినంక బిందెల ప్రదర్శన ఆగింది. పానీపట్ యుద్ధం ముగిసింది.
కేసీఆర్ నీళ్లు రాకముందు బోరు నీళ్లే తాగినం. ఆ నీళ్లు మంచిది కాదని తెలుసు. కానీ ఏం జెయ్యాలె? తప్పలేదు. బోరు నీళ్లు తాగలేకపోతున్నం ఫిల్టర్ చేయమంటే చేయలేదు. అయినా ఆ నీళ్లు తాగక తప్పలేదు. భగీరథ ట్యాంకు వచ్చినంక మంచినీళ్ల బాధలన్నీ పోయినయ్. నాలుగేళ్ల నుంచి మంచినీళ్లు మా ఇంటికే వస్తున్నాయి. నీళ్లెప్పుడొస్తయోని ఎదురు చూసే అవసరమే లేదిప్పుడు.
– కరంటోతు సుజాత, కడపగంటి తండా
ఒకప్పుడు కృష్ణా నీళ్లు ఇస్తామని ట్యాంకులు కట్టినా, నీళ్లు రోజూ ఇయ్యలేదు. అప్పుడు బోరు నీళ్లతో ట్యాంకులు నింపి, ఇచ్చేది. అయ్యి మంచినీళ్లు కాదని తెలిసినా, గొంతు తడుపుకొని బతకడానికి తాగక తప్పలె. అయ్యి తాగితే ఒళ్లు నొప్పులు వచ్చేది. పనిచేయనీకి కాళ్లూచేతులు రాకపోయేది. శానామందికి ఫ్లోరోసిస్ వచ్చింది. ఒకాయనకు (స్కెలెటన్ ఫ్లోరోసిస్) కాళ్లు వంకర పోయింది. నడవరాదు. చనిపోయిండు. భగీరథ వచ్చిన తర్వాతనే ఈ తండాలకు కృష్ణా నీళ్లు రోజూ వస్తున్నయ్. ఈ నీళ్లకు ఆ నీళ్లకు శానా తేడా ఉంది. భగీరథ నీళ్లు తాగుతున్నప్పటి నుంచి ఒంట్లో మంచిగుంటంది.
– శ్రీనివాస్, కడపగంటి తండా
మా తండాకి వారానికి, పది రోజులకు ఒకసారి కృష్ణా నీళ్లతో ట్యాంక్ నింపి ఇచ్చేది. ఆ నీళ్లు రాక బోరు నీళ్లే ఇచ్చేది. ఈ నీళ్లలో ఫ్లోరైడ్ బాగా ఉండే. తాగలేక బావులు, చెలిమల్లో నీళ్లు తెచ్చుకుని తాగేది. మమ్మల్ని అప్పట్లో ఎవడూ పట్టించుకోలె. బావులు ఎండిపోతె కిలోమీటర్లు నడిచిపోయి ఎక్కడ నీళ్లుంటే అక్కడ స్నానం చేసి ఇంటి దగ్గరకు వచ్చినం. ఆడవాళ్లు బిందెడు మోసుకొని వచ్చి స్నానం చేసేది. ఇప్పుడు మా తండా మొత్తం భగీరథ నీళ్లు తాగుతున్నది. తండాకు ఒక్కరోజు మంచినీళ్లు రాకపోతే ఏమైందని ఫోన్ చేస్తున్నరు. మా తండాలన్నిట్లో ఇప్పుడు రెండు నీళ్ల ట్యాంకులున్నయ్. తాగే నీళ్లు, వాడే నీళ్లు విడివిడిగా ఇస్తున్నం. అయిదారు సంవత్సరాల నుంచి ఒక్క ఫ్లోరైడ్ కేసు లేదు.
– దేవీ లాల్, వాచ్యా తండా సర్పంచ్
అప్పట్లో రోజూ నీటి యుద్ధాలే. బిందె నిండినోళ్లకు నిండేది. వెనకోళ్లకు నిండకపోయేది. పదిహేను రోజులకు, వారం రోజులకు, నెల రోజులకు ఒకసారి వచ్చేది. నీళ్లియ్యడానికి ఒక లెక్క లేదు. పద్ధతి లేదు. నీళ్ల సమస్య వచ్చిన ప్రతిసారీ ఖాళీ బిందెలతో ధర్నాలు, రాస్తారోకోలు చేసేది. తండా తండాకీ ఎత్తయిన ట్యాంక్, ఇంటింటికీ నల్లా వచ్చినంక నీళ్ల బాధల్లేవు. 2017 నుంచి నీళ్ల కోసం ధర్నా చేయలేదు. 14 గ్రామపంచాయతీలుగా ఉన్న 17 తండాల్లో ఏ ఒక్క తండాకీ నీటి బాధల్లేవు. ఒకప్పటి ధర్నాలు లేవు.
– శంకర్ నాయక్, కడపగండి తండా సర్పంచ్