మునుగోడు నియోజకవర్గంలో ఏ గడపకెళ్లినా.. సీఎం కేసీఆర్ సంక్షేమ సంతకం కనిపిస్తున్నది. ఎవరిని పలుకరించినా పెద్ద కొడుకులా ఆదుకున్నాడనే సమాధానం వినిపిస్తున్నది. ఫ్లోరైడ్‌తో అల్లాడిన ప్రజలకు మిషన్ భగీరథతో ఉపశమనం కల్పించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి.. సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో వాటన్నింటినీ
మునుగోడులోనూ నిష్పక్షపాతంగా అందించారు.ఇప్పటి వరకూ 2,93,804 మందికి పథకాల ద్వారా లబ్ధి చేకూరుతున్నది. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,258.75 కోట్లు కేటాయిస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు ఇలా ఎన్నో పథకాలతో ఇంటింటా సంక్షేమం.. ఊరూరా సౌభాగ్యం పరిఢవిల్లుతున్నది.
“ఇంటింటా సంక్షేమం.. ఊరంతా వైభోగం ఇదీ మునుగోడు వాకిలి ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ముచ్చటైన ముగ్గు. ఇల్లిల్లూ కేసీఆర్ సంక్షేమ పొదరిల్లులా మారింది. తాను అధికార పార్టీ కానందువల్లే ‘అభివృద్ధి.. సంక్షేమం కుంటుపడింది’ అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న ఆరోపణ పచ్చిఅబద్ధం అనే సంక్షేమ చిట్టా ఇది. ‘ఎన్నికలప్పుడే రాజకీయాలు ఎన్నికల అనంతరం ప్రజలందరూ ప్రభుత్వ బిడ్డలే. అందరికీ సర్కారు ఇచ్చేఅభివృద్ధి.. సంక్షేమ ఫలాలు అందాల్సిందే’ అని తన అసెంబ్లీ ప్రసంగాల్లోనూ.. బయట బహిరంగ సభల్లోనూ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే మాట అక్షర సత్యమని నిరూపించే ఆవర్జా ఇది.”
2018 ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఎన్నికల అనంతరం ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తా.. అని కేసీఆర్ మాట ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ములుగు టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. అయినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ములుగు జిల్లాను ప్రకటించిన నాయకుడు సీఎం కేసీఆర్. మునుగోడులోనూ అదే తీరు.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ఇక్కడున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చూడలేదు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి.. సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయో వాటిన్నంటినీ మునుగోడులోనూ కొనసాగించారు.
రూ.10,258.75 కోట్లతో 2,93,804 మందికి సంక్షేమ లబ్ధి
మునుగోడులో 2014 నుంచి 2022 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న కేవలం 13 రకాల సంక్షేమ పథకాలకే నియోజకవర్గంలో రూ.10,258.75 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, ధాన్యం కొనుగోళ్లు తదితర పథకాలు కొన్ని 2017, 2018, 2019 సంవత్సరాల నుంచి ప్రారంభం కావడం గమనార్హం. ఆయా పథకాల ద్వారా నియోజకవర్గంలో 2,93,804 మందికి లబ్ధి చేకూరింది. మునుగోడు ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టేందుకు అమలు చేసిన మిషన్ భగీరథ వంటి మానవీయ కార్యక్రమాలు, రైతులకు నిరంతరాయంగా అందించే 24 గంటల ఉచిత విద్యుత్.. ఆయా పథకాలకు అయిన వ్యయాన్ని లెక్కలోకి తీసుకుంటే కోటానుకోట్ల రూపాయల విలువ గల కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. గొల్ల, కురుమలకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడితో అందించే మొదటి విడత గొర్ల పంపిణీకి అదనంగా ఇటీవలి కాలంలో గొర్లకు బదులుగా లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడం ఈ లెక్కలకు అదనం.
నిర్లక్ష్యం అబద్ధం.. సంక్షేమం నిజం
కాంగ్రెస్ నుంచి 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలిచి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ పార్టీకి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారనేది బహిరంగ రహస్యం. తానెందుకు రాజీనామా చేశారో ప్రజలకు చెప్పేందుకు ఆలోచించి.. ఆలోచించి ప్రభుత్వం సహకరించడం లేదు.. అభివృద్ధి.. సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఒక అందమైన అబద్ధాన్ని బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆయన చెప్పేది పచ్చి అబద్దం అని ఆయా సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులకు తెలుసు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నదంతా పచ్చి అబద్ధమని ప్రభుత్వం ఇటీవల ప్రకటించి..అమలు చేస్తున్న దళితబంధు పథకమే నిదర్శనం. దళిత బంధులో తొలి విడతలో నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాలను ఎంపిక చేసింది ప్రభుత్వం.
గీ సర్కారు లెక్క ఎవరూ చేయలె..
సీఎం కేసీఆర్ సర్కారు లెక్క ఏ ఎవరూ చేయలె. గొల్లకుర్మలకు గొర్రెలిచ్చిండు.. కావాల్సినోళ్లకు బర్రెలిచ్చిండు. మా మునుగోడు మండలంల 1200 యూనిట్లు మంజూరు చేసి, ఎకౌంట్లో పైసలు జమ చేసిండు. అందరినీ ఆదుకుంటున్న కేసీఆర్‌ను మనం కూడా అండగా ఉండాలె. తిన్నరేవు తలవాలె.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించేందుకు మేం రెడీగా ఉన్నం.
– సింగం లింగస్వామి, పులిపలుపుల, (మునుగోడు రూరల్)
ఎవరిపైనా ఆధారపడకుండా..
సీఎం కేసీఆర్ సర్కారు పాలనలో మహిళలకు భరోసా కలిగింది. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇస్తున్నది. నాకు వచ్చిన రూ.3 లక్షలతో హోమ్ నీడ్స్ షాపు పెట్టుకున్న. దాంతోనే జీవితం గడుపుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి మంచి పథకం అమలు చేయడం మాకు సంతోషంగా ఉంది. మరోసారి కేసీఆర్ కు అండగా నిలబడుతాం.
– పంతంగి పద్మ, జమస్థాన్‌పల్లి గ్రామం(మునుగోడు రూరల్)
పెద్ద కొడుకును దీవిస్తాం..
గతంలో ఏ ప్రభుత్వాలూ వృద్ధులు, వితంతులకు ఎన్నడూ చేయని విధంగా, ప్రతి ఇంటికీ పెద్ద కొడుకులా ‘ఆసరా’గా సీఎం కేసీఆర్ ఉంటున్నరు. రూ.2,016 పింఛన్ ఇస్తూ గౌరవంగా బతికేలా చేశారు. ఆసరా పెన్షన్ డబ్బులే మాకు ఆధారంగా ఉన్నయి. మా పెద్ద కొడుకు కేసీఆర్‌కు ఈ మునుగోడు ఉప ఎన్నికలో దీవిస్తాం.
– మునుగోటి లక్ష్మమ్మ, మునుగోడు
నేను నియ్యత్ తప్పను..
నాకు చెల్క ఉన్నందుకు కేసీఆర్ సారు పైసలు ఇస్తుండు. ఇంతకుముందైతే, పైసలు లేకుండే. కేసీఆర్ పైసలు వచ్చినాక విత్తనాలకు ఇబ్బంది లేకుండా పోయింది. మాకు తోడుగా ఉన్న కేసీఆర్ సారు అండగా ఉంటాం. మల్ల ఆయన వస్తేనే మనకు బాగుంటది. మా పైసలు పోకుండాఉంటాయి. మనకు మంచి జరగాలంటే కారును గెలిపించాలి.
– దండిగా మల్లయ్య, పసునూరు, నాంపల్లి
సొంతింటి ఆడబిడ్డల్లా చూస్తున్నరు
సీఎం కేసీఆర్ మహిళలను సొంతింటి ఆడబిడ్డల్లా చూస్తున్నరు. గర్భిణిగా ఉన్నప్పుడే అనేక పౌష్టికాహారాలు అందిస్తున్నరు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డా క్షేమమే లక్ష్యంగా కేసీఆర్ కిట్‌తో పాటు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడిడే రూ.12 వేలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తున్నరు. ప్రసవించిన దవాఖాన నుంచి ఇంటి దాకా స్వయంగా వాహనం ద్వారా పంపించడం సంతోషంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు.
– ఇరిగి హైమావతి, సోలిపురం, (మునుగోడు రూరల్)
బువ్వ పెడుతున్నడు
రైతుబంధు, రైతుబీమా, పెన్షన్ ఇస్తున్న కేసీఆర్ సార్ గెలిస్తేనే బుక్కెడు బువ్వ తింటాం. బీజేపీ వాళ్లను గెలిపిస్తే, నోటికాడి ముద్ద కూడా లాకుంటారు. కేసీఆర్ సార్ ఉంటేనే మా పోడు భూముల సమస్యలు తీరుతాయి. నేను బతికినంత కాలం కేసీఆర్ సార్కే ఓటు వేస్తా.
– సత్తయ్య యాదవ్, సంస్థాన్ నారాయణపురం
కొడుకులను అడిగే పనిలేదు..
సీఎం కేసీఆర్ సార్ అందిస్తున్న పెన్షన్ నాకు అన్నింటికి అక్కరకు వస్తున్నయి. నెలనెలా పైసలు వస్తుండడంతో షాపులో సామాన్లు కొనుకుంటున్న. కొడుకులను అడిగే పనిలేదు. కేసీఆర్ పెద్ద కొడుకు. ఆయనకు రుణపడి ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్లొచ్చినయ్ అంట. కేసీఆర్ సార్ కారు గుర్తుకే మా ఓటు వేస్తాం. మా తండాలో కూడా ఓట్లు వేపిస్తా.
– ఆంబోతు బిచ్చానాయక్, మర్రిగూడ తూర్పుతండా
పింఛన్ ఇస్తున్న కేసీఆర్‌కే నా ఓటు..
చేతకాని వయసులో చేయూతగా పింఛన్ అందిస్తూ.. ఆర్థిక భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్ కే ఓటు వేస్తా.. కేసీఆర్ పథకాలు ఎంతో బాగున్నాయి. టీఆర్ఎస్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ అందుతాయని ఆశిస్తున్నా. రెండేండ్ల సంది నెలకు రూ.2వేల పింఛన్‌తో బతుకుతున్న.
– జటోతు లాలు, వెంకంబావితండా, సంస్థాన్ నారాయణపురం
బీజేపీ చేసిందేమి లేదు..
సీఎం కేసీఆర్ చేనేత బీమా పథకం పెట్టడం సంతోషంగా ఉంది. నిరుపేదలైన పద్మశాలీలను గుర్తించిన మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటాం. త్రిఫ్ట్ ఫండ్ ద్వారా వచ్చిన డబ్బు మా జీవితాల్లో ఆనందం నింపుతున్నది. చేనేత కుటుంబాలు మొత్తం సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేతలకు చేసిందేమీ లేదు.
– చెరుపల్లి వెంకటేశం, చండూరు
మా బతుకులు మారినయి..
తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే మా బతుకులు మారినయి. రాష్ట్రంలో ఉన్న గొల్లకురుమలను గుర్తించి, ఉచితంగా గొర్రెలు ఇచ్చిండు. మా జీవితాల్లో వెలుగులు నింపిండు. మేం ఉన్నన్ని రోజులు కారు గుర్తుకే ఓటేస్తం. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను గెలిపించుకుంటాం. నిన్న వచ్చిన మంత్రి కేటీఆర్‌ను చూసేందుకు మా ఊరు దొనిపాముల నుంచి చండూరుకు వచ్చిన. సారు బ్రహ్మాండంగా మాట్లాడుతుండు. యువ రాజు ఆయన.
– దోటి లింగయ్య, రైతు, దోనిపాముల, (చండూరు)
సీఎం కేసీఆరే నాకు దీపం..
కేసీఆర్ ఇచ్చే ఆసరా పింఛన్, రైతుబంధుతో బతుకుతున్నా. ఎవరెన్ని చెప్పినా నా అయ్యకే ఓటు వేస్తా. సీఎం కేసీఆరే నాకు దీపం.. లేకుంటే సచ్చె మార్గమే. నాకు ఇద్దరు కొడుకులు. చిన్నోడు 16వ ఏటా టక్కరై చనిపోయిండు. పెనిమిటి కాలం చేసిండు. రెండేండ్ల కింద పెద్ద కొడుకు చనిపోయిండు. పెద్ద కొడుక్కు పెండ్లాం, ఆడపిల్ల, కొడుకు ఉన్నడు. మనవరాలు పెండ్లి అయ్యింది. నాకు నాలుగెకరాల పొలం ఉంది. నాకు రూ.2వేల పింఛన్ ఇస్తున్నరు. నా కోడలికి వితంతు పింఛన్ వస్తున్నది. వాటితోనే మా కుటుంబం గడుస్తున్నది.
రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలె
మునుగోడు ఉప ఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలి. నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. పానం మంచిగ ఉంటే, ఇంటింటికెళ్లి రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలని చేస్తుండే. మన కూసుకుంట్లను గెలిపించాలని అడుగుతుండే. టీఆర్ఎస్ సర్కారు అన్నీ మంచిగా చేసింది. టీఆర్ఎస్ను గెలిపించాలి.
– గంగాదేవి గోపాల్,కుంట్లగూడెం, (చౌటుప్పల్)
రైతు అప్పుల పాలు కావద్దని..
రైతులు అప్పులతో ఆత్మహత్యలు చేసుకోవడం చూసిన కేసీఆర్, ఇక నుంచి ఏ రైతు కూడా అప్పుల పాలు కావద్దని రైతుబంధు పథకం తెచ్చారు. ఆ పెట్టుబడి సాయంతోనే ఎలాంటి అప్పూ లేకుండా కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొని బంగారు పంటలు పండిస్తున్నారు. రైతులు ఆర్థికంగా బలపడుతున్నారు. ఈ రైతుబంధు అమలు చేసిన కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి అండగా ఉంటారు.
– జిట్టగొని వెంకటేశం, (మునుగోడు)
పేదింటి పిల్లకు మేనమామ అయ్యిండు..
సీఎం కేసీఆర్ పేదింటి ఆడపిల్లకు మేనమామ అయ్యిండు. పేద తల్లిదండ్రులకు పెద్ద కొడుకు అయ్యిండు. భారమనుకున్న ఆడబిడ్డ పెండ్లిని ఆనందంగా జరిపేలా చేసిండు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తూ అండగా నిలిచిండు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతి ఆడబిడ్డా రుణపడి ఉంటుంది. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకులా ఉంటున్న కేసీఆర్‌కే మా మద్దతు ఉంటుంది.
– కర్నాటి పద్మ, మునుగోడు