నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్13 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి యాభై నుంచి వంద బైకులతో ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 20 వేల బైకులపై 30వేల మందికి పైగా తరలిరావడంతో రోడ్లన్నీ గులాబీ, ఎరుపు జెండాలు చేతబూనిన జనంతో నిండిపోయాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీపీఎం, సీపీఐ నేతలతో కలిసి రోడ్డు మార్గాన చండూరుకు వచ్చారు. వీరికి మార్గమధ్యంలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల నుంచి కార్యకర్తలు బైకులతో స్వాగతం పలుకుతూ మునుగోడు మీదుగా బంగారిగడ్డ వైపునకు తోడ్కొని వచ్చారు. ఇక గట్టుప్పల్, మర్రిగూడెం, నాంపల్లి మండలాల నుంచి కూడా వేలాది బైకులు బంగారిగడ్డకు చేరుకోవడంతో భారీ జన సందడి నెలకొన్నది.
70 శాతం యువకులే
ర్యాలీకి వచ్చిన వారిలో 70 శాతానికి పైగా యువతే ఉండడంతో నూతనోత్సహం కనిపించింది. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ దారిపొడువునా కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ కేటీఆర్ ముందుకు సాగారు. మంత్రి కేటీఆర్ వస్తున్న వాహనం వెంట పెద్ద సంఖ్యలో యువకులు పరుగులు పెడుతూ కనిపించారు. అంగడిపేటలో రోడ్డకు ఇరువైపులా గ్రామస్తులు కేటీఆర్ కోసం ఎదురుచూస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు బోనాలు, కోలాటాలు, డప్పు నృత్యాలతో స్వాగతం పలికారు. చండూరు పట్టణంలోకి ర్యాలీ ప్రవేశించే సరికి భారీ జనసందోహం తోడైంది. రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న జనమే కాకుండా ఇండ్ల ముందు, మిద్దెల మీద, బిల్డింగ్‌ల మీద కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వేచి ఉన్నారు. వీరందరికీ కేటీఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మధ్య మధ్యలో చేతులతో కారు స్టీరింగ్ తిప్పుతున్నట్లు సైగలు చేస్తూ కారు గుర్తును గుర్తుంచుకోవాలని చేతులు జోడించి నమస్కరించారు. దాంతో ప్రజల నుంచి ఈలలు కేరింతలతో ప్రతిస్పందన లభించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి ర్యాలీని నడిపిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ కనిపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతులు జోడించి ప్రజలకు నమస్కరిస్తూ , అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు.
బస్టాండ్ రోడ్డులో సభ
చండూరు పట్టణంలోని బస్టాండ్ రోడ్డులో మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన బహిరంగసభను నిర్వహించారు. సమైక్య పాలనలో ఫ్లోరైడ్ భూతానికి చిక్కి శిల్యమైన మునుగోడును సీఎం కేసీఆర్ సారథ్యంలో సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పారు. 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోకపోగా ప్రజల విశ్వాసాన్ని రూ. 18వేల కోట్లకు అమ్ముకున్నాడని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డికి ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. లెఫ్ట్ పార్టీలు, టీఆర్ఎస్ కలిసి బీజేపీపై చేస్తున్న పోరాటానికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని, ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించడం ఖాయమని ప్రకటించారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మూడున్నరేండ్లుగా మునుగోడు అభివృద్ధి ఆగిపోయిందని, ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. మునుగోడు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, మిగిలి ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యమని ప్రకటించారు.
నామినేషన్ దాఖలు
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, టీఆర్ఎస్ నేత నంద్యాల దయాకర్రెడ్డితో కలిసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఒక సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. అనంతరం మరో సెట్‌ను కూసుకుంట్ల తరుఫున ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, హైకోర్టు అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ దాఖలు చేశారు. మూడో సెట్ నామినేషన్‌ను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమభరత్తో కలిసి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేశారు.
భూనిర్వాసితులకు పట్టాలిప్పిస్తా: ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు
చౌటుప్పల్, అక్టోబర్ 13 : మా తమ్ముడు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి దండు మల్కాపురానికి ఇంచార్జిగా ఉండి నాకు ఒక మాట చెప్పిండు. భూములు కోల్పోయిన 431 మంది నిర్వాసితులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరాడు. ఈ వేదిక మీద నుంచి నా తమ్ముడు జీవన్‌రెడ్డికి చెప్తున్న ఇది మీ ప్రభుత్వం. ఇది మీ కేసీఆర్ ప్రభుత్వం. మన ప్రభుత్వం. నవంబర్ ఆరో తేదీ తరువాత కొత్తగా గెలిచే మునుగోడు ఎమ్మెల్యే కూసూకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లగొండ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి నేనే స్వయంగా వచ్చి ఆ 431 మందికి పట్టాలిప్పించే బాధ్యత నాది’ అని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టమైన హామీ ఇచ్చారు. చండూరులో గురువారం జరిగిన ఎన్నకల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దండుమల్కాపూర్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా స్దానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ విషయమై వెంటనే స్పందించిన ఆయన స్యాయం చేస్తానని హామీ ఇచ్చి మంత్రి కేటీఆర్‌కు తెలియజేసారు. నవంబర్ 6 తరువాత దండుమల్కాపూర్ రైతులకు జీవన్‌రెడ్డి చెప్పిన విధంగా న్యాయం చేస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
టీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటా : మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మునుగోడు అభివృద్ధి తమ బాధ్యత అని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా సమీక్షలు చేస్తూ, అందరినీ భాగస్వాములను చేస్తూ.. బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున హర్షద్వానాలు వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే….. “ఇది మీ ప్రభుత్వం. మళ్లా ఇక్కడ గెలిచేది మన ప్రభుత్వమే. ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జాం. మేము కూడా ఇరుక్కుపోయినం. యువకులు మనం గెలుస్తున్నం అన్నరు. జర మా రోడ్లను బాగు చేయమన్నరు. నేనే ఒక్కటే మాట ఇస్తున్న.. మీరు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే నేను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా. ఎలక్షన్లకు ముందు ఒక మాట… తర్వాత ఒక మాట కాదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా మంత్రిగారూ, నేను వస్తం. ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో…. నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో.. అట్లాగే మేమిద్దరం కలసి మునుగోడు బాధ్యత తీసుకుంటాం.
ఒక్కో పనికి నా బాధ్యత. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తరూ… ఆయనకు తమ్ముడిగా అండగా ఉండి… ఇక్కడ కావాల్సిన రోడ్లు గానీ, ఇతరత్రా కార్యక్రమాలు గానీ… చేయించే సంపూర్ణ బాధ్యత నేను తీసుకుంటా. నా మాట మీద విశ్వాసం ఉంచండి. జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా…. ప్రతి మూడు నెలలకు ఒకసారి మిమ్మిల్నీ పిలుస్తాం… మీతో చర్చిస్తాం. నాలుగేండ్లుగా రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోని మునుగోడును, మీ గోడును విని పరిష్కరిస్తాం. బ్రహ్మాండంగా అభివృద్ధి బాట పట్టిస్తాం. మూడో తారీఖు నాడు మోత మోగాలి. కారు గుర్తుపై బ్రహ్మండంగా అన్ని ఓట్లు పడేలా బాధ్యత తీసుకొండి. మీ ఆత్మగౌరవానికి, ఆయన డబ్బు మదానికి ఇది పోటీ. మునుగోడు ప్రజలు సత్తా చూపాలి. కామ్రేడ్స్ కలిసొచ్చాక ఢంకా బజాయించి గెలుస్తామనే విశ్వాసం ఉంది. బ్రహ్మాండమైన మెజార్టీతో ఆరు తారీఖునాడు గులాబీ జెండా ఎగిరేలా అందరం పనిచేద్దాం.”