నిఘా నీడలో శోభాయాత్ర
నీలగిరి, సెప్టెంబర్ 8 : జిల్లాలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన రహదారులు, వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలతోపాటు ప్రత్యేకంగా మరో 180 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎస్పీతోపాటు ఐటీ సెల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గణేశ్ విగ్రహాలకు, మండపాలకు జియో ట్యాగింగ్ చేసిన పోలీసులు.. కేటాయించిన నంబర్ల వారీగా శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నారు. 14 ఫీట్లకు పైబడిన విగ్రహాలను నాగార్జునసాగర్, వాడపల్లిలో.. మిగతావి ఇతర ప్రాంతాల్లో (14వ మైలురాయి వినహా) నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 1500 మంది పోలీస్ సిబ్బంది, 170 మంది పోలీస్ వలంటర్లతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. చెదురుమదురు ఘటనలు జరుగకుండా కమ్యూనిటీ సంబంధిత కేసుల్లో ఉన్న వారిని బైండోవర్ చేశారు. రౌడీషీటర్లతోపాటు క్రిమినల్ రికార్డున్న వారి కదలికలపై నిఘా పెట్టారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో వల్లభరావు చెరువు, దండెంపల్లి కాల్వ వద్ద, జిల్లాలో ప్రధాన ప్రాంతాలైన వాడపల్లి, నాగార్జునసాగర్, దేవరకొండ, డిండి, మిర్యాలగూడ, వేములపల్లి కాల్వల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. వినాయక శోభాయాత్ర, నిమజ్జనోత్సవానికి గణేశ్ ఉత్సవ కమిటీలతోపాటు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశాయి. అన్ని ప్రాంతాల్లో విద్యుద్దీపాలతోపాటు బారికేడ్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
జిల్లాలో శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలో నిమజ్జనం చేసే ప్రధాన ప్రాంతాలైన నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, వాడపల్లి, నాగార్జునసాగర్, దేవరకొండ, డిండి, మిర్యాలగూడ, వేములపల్లి కాల్వల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఫ్లడ్ లైట్లు, పికెట్‌ను ఏర్పాటు చేసింది. గజ ఈతగాళ్లను నిమజ్జన ప్రాంతాల వద్ద అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే జిల్లాలోని ఏ ప్రాంతానికైనా ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో చెరుకునే విధంగా పెట్రో వాహనాలు, బ్లూకోట్స్, సంబంధిత పోలీస్ అధికారులను అప్రమత్తం చేసే విధంగా ఆన్లైన్ విధానం ద్వార భద్రత పర్యవేక్షిస్తున్నారు.
1500 మందితో బందోబస్తు
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో డీఐజీతోపాటు ఒక ఎస్పీ, ఒక ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 26 మంది సీఐలు, ఐదుగురు ఆర్ఐలు, 75 మంది ఎస్‌ఐలతోపాటు 900 మందికి పైగా పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వీరికి అదనంగా ఒక్కో సబ్ డివిజన్‌కు 50 మంది చొప్పున మూడు డివిజన్లకు 170 మంది పోలీస్ వలంటర్లను భాగస్వాములను చేస్తున్నారు. వీరితోపాటు తెలంగాణ స్పెషల్ పోలీస్, ఫారెస్టు, ఆబ్కారీ శాఖల అధికారులను సైతం బందోబస్తులో పాల్పంచుకోనున్నారు.
24 గంటల ముందే వైన్ షాపులు బంద్..
శోభాయాత్ర సందర్భంగా జిల్లాలోని అన్ని వైన్‌షాపులను 24 గంటల ముందుగానే పోలీసులు మూయించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రహదారులు, వివిధ కాలనీల్లోని సీసీ కెమెరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశారు. నల్లగొండ పట్టణంతోపాటు మిర్యాలగూడ, దేవరకొండ వంటి ప్రధాన పట్టణాల్లో గణేశ్ శోభాయాత్రను జిల్లా పోలీస్ కార్యాలయ కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తారు. సుమారు 2800 సీసీ కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశారు.
యాదాద్రి జిల్లాలోఏర్పాట్లు ఇలా…
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 8 : యాదాద్రి భువనగిరి జిల్లాలో గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా పూజలందుకున్న గణనాథుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ క్రమంలో లంబోధరుడి శోభాయాత్ర, నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గణనాథులను అంగరంగ వైభవంగా సాగనంపేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు సిద్ధమయ్యారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసుల అనుమతితో 2,593 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. వాటి నిమజ్జనానికి జిల్లాలో 19 చెరువులను గుర్తించారు. చెరువుల వద్ద ప్రత్యేక బారికేడ్లు, చెరువులోకి వినాయకుడిని తీసుకెళ్లడానికి ఒక మార్గం, వాహనం రావడానికి మరో మార్గాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు కేటాయించిన నంబర్ ప్రకారం చెరువుల వద్ద విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. మండపాల వద్ద విగ్రహాలను వాహనంలోకి ఎత్తడానికి పెద్ద క్రేన్లు అందుబాటులో ఉంచారు.
19 చెరువుల వద్ద ఏర్పాట్లు..
జిల్లాలోని 19 చెరువుల వద్ద మున్సిపాలిటీ, మత్య్స, ఇరిగేషన్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భువనగిరి పెద్ద చెరువు వద్ద మూడు పెద్ద క్రేన్లతోపాటు ఆయా చెరువుల వద్ద ఒక్కో క్రేన్‌ను సిద్ధంగా ఉంచారు. భారీ లైటింగ్స్, నీటి సౌకర్యం, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
నల్లగొండలో 9గంటలకు తొలిపూజ
రామగిరి, సెప్టెంబర్ 8 : నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలను పానగల్ సమీపంలోని వల్లభరావు చెరువు, దండెంపల్లి వద్ద గల ఎస్ఎల్బీసీ కాల్వలో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గురువారం పరిశీలించి పలు సూచనలు చేశారు. నల్లగొండలోని పాతబస్తీ, హనుమాన్‌నగర్ ఒకటో విగ్రహం వద్ద తొలి పూజ చేసి శోభాయాత్రను ప్రారంభించనున్నారు. ఈ పూజకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, పీస్ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు.
శోభాయాత్ర సాగుతుందిలా..
నల్లగొండ పట్టణంలో గణనాథుల శోభాయాత్ర వివరాలను గణేశ్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. పది ఫీట్లలోపు విగ్రహాలను పానగల్ బైపాస్ సమీపంలోని వల్లభరావు చెరువులో, అంతకంటే ఎత్తు విగ్రహాలను దండెంపల్లి గ్రామ సమీపంలోని ఎస్ఎల్బీసీ కాల్వలో నిమజ్జనం చేయనున్నారు. పాత బస్తీ నుంచి వచ్చే విగ్రహాలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ మీదుగా గడియారం సెంటర్‌కు చేరుకుంటాయి. అన్ని ప్రాంతాల్లోని విగ్రహాలు సాయంత్రానికి గడియారం సెంటర్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి రామగిరి మీదుగా పానగల్ వల్లభరావు చెరువు, దండెంపల్లి కాల్వ వద్దకు తరలించనున్నారు. నిమజ్జనానికి తరలే గణనాథులకు పాతబస్తీ, గడియారం సెంటర్, పానగల్ బైపాస్‌లో ఉత్సవ కమిటీ స్వాగతం పలుకనుంది.
నేడు విద్యాసంస్థలకు సెలవు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ క్రిష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజుకు బదులుగా నవంబర్ 12న పని దినంగా పరిగణించి కొనసాగించాలన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
జిల్లాలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. నిర్వాహకులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాం. డీజేలకు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులు కండీషన్లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలి. మండపాలకు కేటాయించిన నంబర్ల ప్రకారంగా శోభాయాత్రలో పాల్గొనాలి. రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, ఇరిగేషన్ అధికారులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశాం. నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాం. మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనవద్దు. చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దు.
– రెమా రాజేశ్వరి, నల్లగొండ జిల్లా ఎస్పీ