మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా
సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు
ఆకర్షితులై గులాబీ కండువాలు కప్పుకొంటున్నారు. గురువారం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డతండా, ఆంబోతు తండాకు చెందిన 60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, 5వ వార్డు సభ్యుడు వడ్త్యా హతీరాం, ఐదుదోనల తండాకు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.మర్రిగూడ మండలంలోని లెంకలపల్లికి చెందిన 15మంది కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
మర్రిగూడ, సెప్టెంబర్ 8 : గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన 15మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఐతగోని వెంకటయ్యగౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు వరికుప్పల వెంకటయ్య ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు. ఓటు బ్యాంకు లేని బీజేపీకి నియోజకవర్గ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోసారి మోసపూరిత వాగ్దానాలు, అలవికాని హామీలిస్తూ రాజగోపాల్‌రెడ్డి ప్రజలను మోసం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రజలు దీవించి ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్, టీఆర్ఎస్ నాయకులు ఐతగోని నర్సింహ, శ్రీశైలం, వెంకటయ్య పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పోర్లగడ్డ తండా, అంబోతుతండా నుంచి 60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, 5వ వార్డు సభ్యుడు వడ్త్యా హతీరాం, ఐదుదోనల తండాకు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మండల కేంద్రంలో గురువారం కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజు, జిల్లా నాయకులు గుత్తా ప్రేమ్‌చందర్‌రెడ్డి, శివరాత్రి సాగర్, ఇంద్రసేనారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు లారీ భిక్షం పాల్గొన్నారు.