యాదాద్రి, సెప్టెంబర్ 8 : యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి వారికి భక్తులతో నిర్వహించే మొక్కు బ్రహ్మోత్సవాన్ని అర్చకులు గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భాగంగా జరిగే మొక్కు బ్రహ్మోత్సవ సేవను పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం జరిపించారు. మహాకుంభస్థాపన, చతుస్థానార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అనంతరం రథోత్సవ సేవ నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే వాహన సేవలను మొక్కు బ్రహ్మోత్సవాల్లో నిర్వహించారు. కల్యాణోత్సవం కంటే వందరెట్లు పుణ్యఫలాన్ని అనుగ్రహించే ఉత్సవం మొక్కు బ్రహ్మోత్సవ సేవ అని తెలిపారు.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామి వారి సుదర్శన నారసింహ హోమం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహన సేవ నిర్వహించారు. స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం వేళలో స్వామి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ, తిరువావరాధన ఘనంగా నిర్వహించారు. స్వయంభూ నారసింహుడికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. శ్రీవారి ఖజానాకు రూ. 13,06,561 ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు.