నేరేడుచర్ల, ఆగస్టు 30 : ఏటా వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం.. పండుగకు రెండ్రోజుల ముందు నుంచే వీధివీధినా విగ్రహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తాం. నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. తర్వాత ఆ ఆదిదేవుడిని నిమజ్జనానికి తీసుకెళ్తాం. ఆ సమయం మనకెంతో సంబురంగా సాగుతుంది. యువతకు, పిల్లలకైతే రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. అయితే.. గణపతిని ప్రతిష్ఠించాం.. పూజించాం.. సాగనంపాం అనుకుంటే సరిపోదు. ఆ లంబోధరుడిని చూసి మనమెంతో నేర్చుకోవాల్సి ఉంది. మూషిక వాహనంపై కనిపించే గణనాథుడి ప్రతి అవయవమూ మనకు ఒక సందేశాన్నిస్తుంది. గణనాథుడి నుంచి స్ఫూర్తి పొందితే విద్యార్థులు విజేతలుగా నిలిచేందుకు దారి కనిపిస్తుంది. కుంగుబాటుకు గురయ్యేవారికి ధైర్యం నూరిపోస్తుంది. ఎదిగినా ఒదిగి ఉండాలనే ఔన్నత్యాన్ని చూపిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకునేందుకు ఔషధిలా పనిచేస్తుంది. ఆ చదువుల తల్లి కుమారిడిని మనం గురువుగా భావించి మంచిని గ్రహిస్తే ఆయన అవతారంలోని ప్రతి అవయవమూ నేటి విద్యార్థులకు ఓ పాఠ్యాంశమే.
కళ్లతో చూసింది బాగా గుర్తుంటుంది..
వినాయకుడి కళ్లు చింతాకులా చిన్నగా ఉంటాయి. మనవి కూడా అంతే ఏదైనా దృశ్యాన్ని చక్కగా చూడాలంటే కళ్లు దగ్గరగా చేసుకుని చిన్నవిగా చేసి చూస్తాం. విద్యార్థులు వినాయకుడిని పూజించేటప్పుడు ఆ కళ్ల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి. ఏకాగ్రత, సునిషితమైన పరిశీలనకు వినాయకడి కళ్లు మనకు ఆదర్శం. ఆయన కళ్లు విషయాలను నిషితంగా గమనించాలని, సూక్ష్మ గ్రహకాలు కావాలని ఇచ్చే సందేశానికి సంకేతం.
నోరు మంచిదైతేనే..
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు పెద్దలు. వినాయకుడి నోరు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. ఆయన చిన్న నోరును చూసి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. తక్కువగా మాట్లాడాలని, అనవసరంగా నోరు పారేసుకోవద్దని ఆ చిన్న నోరు చెప్పకనే చెపుతున్నది. ఇంకా ఆ చిన్న నోటిని తొండం కప్పేసి ఉంటుంది. వివేకానికి చిహ్నంగా చెప్పుకొనే తొండం ప్రతి మాట వడపోతలా బయటకు రావాలని సూచిస్తుంది. అందుకే ఇతరులతో మాట్లాడేటప్పుడు వినయం, వివేకం, విధేయత ప్రదర్శిస్తూ అనవసరమైన మాటలు వినవద్దని చెబుతోంది.
పెద్ద దేవుడు.. చిన్న వాహనం
అన్నింటికన్నా విచిత్రమైన విషయం వినాయకుడి వాహనమైన ఎలుక. మిగతా దేవతల వాహనాలతో పోలిస్తే అతి సామాన్యమైనది. అనవసరమైన కోరికలను అదుపులో ఉంచుకునేందుకు ఈ ఎలుక వాహనం మనకు మంచి విషయం చెపుతుంది. విద్యార్థులు చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను పెద్ద వాహనాలు కొనివ్వాలని ఇబ్బంది పెడుతున్నారు. వద్దన్నా వినకుండా వాటిని నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అవసరం లేకున్నా సెల్ఫోన్ వాడకం, జేబు ఖర్చు.. ఇలాంటి అలవాట్ల విషయంలో మనసును అదుపులో పెట్టుకోవాలి. లేనిపోని ఆర్భాటాలు, కోరికలకు వెళ్లవద్దని ఈ మూషిక వాహనం చెబుతోంది. విద్యార్థి దశలో స్థాయికి తగ్గట్లుగా సైకిళ్లతో సరి పెట్టుకోవాలని ఎలువ వాహనం చూస్తే అర్థమవుతుంది.
చాటంత చెవులు..
గణపతి దేవుడికి చాటంత చెవులు ఉంటాయి. ఎవరైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు చెవులు చాటంత చేసుకొని విను అనే మాట వాడుకలో ఉన్నదే. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు సరిగా వినకపోతే విషయం అర్థం కాదు. అందుకే ఆ దేవుని పెద్ద చెవులు మనకెప్పుడూ గుర్తుకు రావాలి. ప్రతి విషయాన్ని వీలైనంత ఎక్కువగా విని నేర్చుకోవాలనే సందేశమే ఆయన చెవుల ద్వారా తెలుస్తుంది.
చక్కగా చదువాలి.. అర్థం చేసుకోవాలి
చవితి రోజు విద్యార్థులు తమ పుస్తకాలు, పెన్నులను వినాయకుడి వద్ద పూజలో ఉంచుతారు. అక్కడ పెట్టి పూజిస్తే చదువు చక్కగా వస్తుందన్నది నమ్మకం. గణపతి తల వంక చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే పెద్ద తల గొప్పగా ఆలోచించాలని సందేశాన్నిస్తుంది. చదువులో కలిగే ఆటంకాలను అధిగమించేందుకు వినాయకుడి తలను పూజిస్తే మెదడు చురుకుగా పనిచేస్తుందని, విద్య చక్కగా ఒంటబడుతుందనేది అంతరార్థం. పుస్తకం ముందున్నప్పుడు ఏకాగ్రత కోసం వినాయకుడి పెద్ద తలను దృష్టిలో పెటుకోవాలి.
నిండిన బొజ్జా సందేశమే..
ఏకదంతున్ని చూడగానే పెద్ద బొజ్జ కనిపిస్తుంది. చదువుకునేటప్పుడు నేర్చుకున్నది చాలులే అని తృప్తిచెందక మరింత జ్ఞానాన్ని సంపాదించాలని ఆ బొజ్జను చూసి అన్వయించుకోవాలి. చదివింది, నేర్చుకున్నది చాలదు.. ఇంకా నా కడుపు నిండలేదు.. అన్నట్లుగా విద్యార్థులు భావించేందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎంత చదివినా ఇంకా చదువాలి, ఇంకా నేర్చుకోవాలనే తపన చెప్పేదే వినాయకుడి బొజ్జ.