భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 27 : గణేశ్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాంతి సంఘం సభ్యులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పర్యావరణహితమైన విగ్రహాలను పూజించాలని తెలిపారు. శాంతి సంఘం సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. నిమజ్జనాల సమయాల్లో చెరువుల్లో పూజాసామగ్రి వేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. గణేశ్ మంటపాల వద్ద విద్యుత్ లైట్ల ఏర్పాట్లు, నిమజ్జనం సాగే రోడ్లపై మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు తమ విధులను పకడ్బందీగా నిర్వర్తించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలని ఆమె సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు డి, శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌తివారీ, ఆర్డీఓలు భూపాల్‌రెడ్డి, సూరజ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారు లు, పోలీస్ అధికారులు, శాంతి సంఘం సభ్యులు భట్టు రామచంద్రయ్య, అశోక్, అక్తర్, జాన్సన్, కృష్ణ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పట్నం కపిల్, ఉడుత భాస్కర్, కిషన్‌జీ, కృష్ణాచారి, కొండల్, నాగేందర్, నరేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ పమేలాసత్పతి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్లో పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌కు పూలబోకేలు అందించి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమాల్లో ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ వర్గాల నాయకులు, ప్రజలు, సామాజికవేత్తలు, యువకులు ఉన్నారు.