నల్లగొండ ప్రతినిధి, జూలై12(నమస్తే తెలంగాణ) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ముందస్తుగానే జలకళను సంతరించుకున్నది. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో ఆలమట్టి, నారాయణపూర్ ఇప్పటికే నిండడంతో వరద జూరాల మీదుగా మంగళవారం శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరింది. దాంతో దిగువ నున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పాటు ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల్లో వర్షం కురిస్తే చాలు ఆ నీరంతా శ్రీశైలంలోకి రానున్నది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు 39,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
తుంగభద్ర డ్యాం నిండడంతో 10 గేట్లు ఎత్తి 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దాంతో పాటు జూరాల నుంచి కూడా 31,341 క్యూసెక్కుల నీరు శ్రీశైలం వైపు పరుగులు తీస్తున్నది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి విడుదలైన నీరు భారీ స్థాయిలో శ్రీశైలం డ్యాంలోకి బుధవారం చేరుకోనున్నది. వరద నీరు వచ్చిన అనంతరం శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా సుమారు 29వేల క్యూసెక్కుల నీరు నిరంతరం నాగార్జునసాగర్‌కు రానున్నది.
మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధానాన్ని ఆనుసరిస్తూ శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే లోపే వీలైనంత నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నది. ఫలితంగా సాగర్ ఆయకట్టులో నీటి విడుదల కూడా సకాలంలో జరిగేందుకు దోహద పడుతున్నది. ఇదే విధానం అమలైతే వరుసగా ఐదో ఏడాది కూడా సకాలంలోనే ఆయకట్టుకు సాగునీరు విడుదల కానున్నది. సమైక్య పాలనలో శ్రీశైలం పూర్తిగా నిండి గేట్లు ఎత్తే వరకు చుక్క నీరు సాగర్‌కు వచ్చేది కాదు. కానీ సీఎం కేసీఆర్ కృష్ణానదిలో మన నీటివాటా విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తుండడంతో ఎడమ కాల్వ ఆయకట్టుకు ఇబ్బందులు తప్పాయి. ఆయకట్టులోని 11లక్షల ఎకరాలకు ఈ సీజన్లో నీటి విడుదల కోసం త్వరలోనే సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు.
ఎగువ కృష్ణాలో భారీ వర్షాలు
కర్నాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. దాంతో నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగుల కాగా ప్రస్తుతం 1697.15 అడుగులుగా ఉంది. నారాయణపూర్ డ్యాం గరిష్ఠనీటిమట్టం 1615 అడుగులు కాగా ప్రస్తుతం 1612 అడుగులుగా ఉండగా 1.04లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా ప్రస్తుతం 1040.22 అడుగులుగా ఉంది. ఇక్కడి నుంచి 31,341 క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు కూడా నిండడంతో 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అటు జూరాల, ఇటు తుంగభద్ర నుంచి వచ్చే వరదతో శ్రీశైలంలో నీటిమట్టం పెరుగనున్నది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా మంగళవారం సాయంత్రం వరకు 824.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద మరో మూడు నెలలు కొనసాగే అవకాశం ఉంది. దాంతో శ్రీశైలంతో పాటు దిగువన ఉన్న నాగార్జునసాగర్ కూడా జలకళ సంతరించుకోనుంది.

ఆనందంలో ఆయకట్టు రైతాంగం
కృష్ణానదిలో వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం ఆనందంగా ఉంది. ఈ ఏడాది ముందస్తుగానే సాగునీటి విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద రెండు రాష్ర్టాల్లో కలిపి దాదాపు 11 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తుంటారు. వరుసగా నాలుగేళ్లుగా రెండు పంటలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశారు. వేసవిలోనూ తాగునీటి అవసరాలతో పాటు చెరువులను నింపేందుకు కూడా కాల్వలకు నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ సాగర్‌లో ప్రస్తుతం 528.41 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా దాదాపు 18.41 అడుగుల నీరు అదనంగానే ఉన్నది. దాంతో త్వరలోనే నారుమళ్ల కోసం నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీశైలం నుంచి వచ్చే వరదనీటిని బట్టి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటివిడుదల చేయనున్నారు. గతేడాది జూలైలోనే నాగార్జునసాగర్ డ్యాంలోకి ఇన్‌ఫ్లో మొదలవ్వగా ఆగష్టు 5 నుంచి ఎడమకాల్వకు నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది కూడా పరిస్థితి పూర్తి ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్సారెస్పీకి త్వరలోనే….
గోదావరి నది కూడా పరవళ్లు తొక్కుతుండడంతో కాళేశ్వరం ద్వారా జిల్లా పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు త్వరలోనే సాగునీటి విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వారంలోనే నీటి విడుదల ప్రణాళికపై స్పష్టత వస్తుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. సాగర్ ఆయకట్టుతో పోలిస్తే ఎస్ఆర్ఎస్పీకి ముందుగానే నీటిని విడుదల చేస్తారు. గతేడాది జూలై 19వ తేదీన నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్సారెస్పీ ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని 2.60 లక్షల ఎకరాలకు గోదావరి జలాల అందుతున్నాయి. ఓ వైపు గోదావరి, మరోవైపు కృష్ణా పరవళ్లతో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయకట్టు ఈ ఏడాది కూడా సస్యశ్యామలం కానున్నది. ఇక మరోవైపు మూసీ, డిండి ప్రాజెక్టులకు కూడా జలకళ సంతరించుకున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నాన్ ఆయకట్టు ప్రాంతాల్లోనూ చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో బోర్లు, బావుల్లోనూ భూగర్భ జలాలకు ఢోకా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
వారంలో మూసీ నీటి విడుదల
వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాల విషయంలో అధికారులతో జరిగిన సమీక్షలో వారంలో మూసీ నీటిని విడుదల చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నీటి షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దాంతో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో సుమారు 40వేల ఎకరాల ఆయకట్టుకు ఢోకా ఉండదు. ఇప్పటికే ఆయకట్టు పరిధిలోని 41 చెరువులతో పాటు 35కు పైగానే కుంటలు వంద శాతం నిండాయి. దాంతో భూ గర్భజలాలు పెరిగి బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. పంట చేతికి వచ్చేంత వరకు దశలవారీగా నీటిని విడుదల చేయనుండడంతో సాగు చేసిన పంటకు ఢోకా ఉండదు. మూసీ ప్రాజెక్టుకు మరమ్మతుల అనంతరం ఆయకట్టులో సాగునీటికి కొరత లేకుండా పోయిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.