నకిరేకల్, జూలై 12 : కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని చాటిందని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఆడపిల్లలు అన్నిరంగాల్లోనూ రాణించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని చందుపట్ల గ్రామాన్ని సందర్శించారు. అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు, గ్రామస్తులు గవర్నర్కు ఘనస్వాగతం పలికారు. చందుపట్లకు చేరుకున్న గవర్నర్ మొదటగా రుద్రమదేవి కాంస్య విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ శివారులోనున్న రుద్రమదేవి మరణ శిలా శాసనం వద్ద పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అనంతరం శిలాశాసనాలను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.
రుద్రమదేవి మరణ శిలాశాసనం చందుపట్లలో ఉన్నందున ఆ మె చరిత్ర తెలుసుకోవడానికే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. చీమలగడ్డ ఫ్లైఓవర్ వద్దనున్న కమ్మరివారి గుడి సె వాసులకు గవర్నర్ తమిళిసై రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెగ్జిన్ పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ, వారసత్వ శాఖ సహాయ సంచాలకులు బుజ్జి, ఆదిత్య శర్మ, డీపీఆర్ఓ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈఈ తిరుపతయ్య, నకిరేకల్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, కమిషనర్ బాలాజీ పాల్గొన్నారు. అంతకుముందు నార్కట్పల్లి ఓసీటీఎల్ అతిథి గృహం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్కు అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్, సూర్యాపేట ఎస్పీ రాజే ంద్రప్రసాద్, డీఆర్ఓ జగదీశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికి మొక్కలు అందజేశారు.