సూర్యాపేట టౌన్, జూలై 10 : బక్రీద్ పర్వదినాన్ని త్యాగానికి ప్రతీకగా జరుపుకొంటారని, త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని ఆదివారం సూర్యాపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు మసీదులకు వెళ్లి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మతసామరస్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షాదక్షతలే కారణమన్నారు. పండుగలు, జాతరలు ఏవైనా భాగస్వామ్యం అందరిదీ ఉందంటే అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు. భిన్న సంస్కృతులకు తెలంగాణ పెట్టింది పేరని, అటువంటి సంస్కృతులను సీఎం కేసీఆర్ పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెడుతున్న రాష్ట్రం వైపు యావత్ భారతదేశం చూస్తుందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం మతాల మధ్యన చిచ్చు రగిల్చి పబ్బం గడుపుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వర్గం వైశమ్యాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనుకునే వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేడుకల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ఉప్పల ఆనంద్, కౌన్సిలర్లు తాహేర్ పాషా, జహీర్, ఎలిమినేటి అభినయ్, అజీజ్, రియాజుద్దీన్, సయ్యద్, తాహెర్, నయీమ్, రఫీ, మైనార్టీ నాయకులు, వార్డుల నాయకులు పాల్గొన్నారు.
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగలకు ఆది పండుగ తొలి ఏకాదశి అని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ఆయన పూజలు చేసి మాట్లాడారు. ఈ ఏడాది విస్తారంగా కురుస్తున్న వర్షాలతోపాటు కృష్ణా, గోదావరి జలాలతో పంటలు సమృద్ధిగా పండి అన్ని రంగాల అభివృద్ధితో ప్రతి ఇంటా సిరులు నిండాలని ఆకాంక్షించారు. ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలో ప్రజలంతా అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నారని అన్నారు. నిరంతర విద్యుత్, పుష్కలంగా తాగు, సాగునీటితో అన్ని రంగాలు ఎవరూ ఊహించని అభివృద్ధితో రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు, జడ్పీటీసీ జీడి భిక్షం పాల్గొన్నారు.
మూసీ ప్రాజెక్టు సందర్శన
సూర్యాపేట రూరల్ : సూర్యాపేట మండలంలోని సోలిపేట గ్రామ పరిధిలో గల మూసీ ప్రాజెక్టును మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆదివారం సందర్శించారు. మూసీ పరీవాహక ప్రజలు నదీ వైపు వెళ్లవద్దని సూచించారు. వానకాలం, యాసంగి పంటల సాగుకు ఢోకా లేదన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి సామర్థ్యం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రత్నపురంలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. మంత్రి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి, తనయుడు వేమన్‌రెడ్డి, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, సర్పంచ్ మెట్టు వినోద్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.