చౌటుప్పల్, జూలై 10 : ఇదొక బడా మోసం.. సామాన్యులు మొదలుకొని చదువుకున్న విజ్ఞాన వంతులు సైతం ఈ ఉచ్చులో పడేలా పక్కా స్కెచ్ వేశారు. దేశంలోనే అతి పెద్ద టీవీ షో అయిన కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) పేరుతో అమాయకులు ఎర వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దేశ ప్రధాని నరేంద్రమోదీ, బాలీవుడ్ హీరో అమితాబ్‌బచ్చన్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీల పేర్లు చెబుతూ నమ్మిస్తున్నారు. వీరిచేతుల మీదుగా ప్రైజ్ మనీ అందిస్తామని ఉచ్చు వేస్తున్నారు. ఈ షో పేరు తో కొంతమంది నంబర్లు సెలక్ట్ చేసి లక్కీ డ్రా తీశామని, దీంట్లో మీ నంబర్ సెలక్ట్ అయ్యిందని వాట్సాప్, వాయిస్ మెసేజ్‌లు చేస్తూ ఆకర్షిస్తున్నారు. ఈ మాయలో పడితే బ్యాంక్‌లో దాచుకున్న రూ. లక్షలు మాయమవడం ఖాయం.
రోహిత్‌శర్మ పేరుతో పరిచయం..
కేబీసీ షో మేనేజర్ రోహిత్‌శర్మ పేరుతో వాట్సాప్‌లో పరిచయమవుతారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఫోన్ నంబర్లను లక్కీ డ్రా వేశామని నమ్మబలుకుతారు. వాట్సాప్ మేసేజ్‌తో పాటు వాయిస్ మెసేజ్‌తో లక్కీ డ్రాకు సంబంధించిన పూ ర్తి వివరాలను వెల్లడిస్తారు. మీ నంబర్ లక్కీ డ్రాలో సెలక్టయ్యిందని, మీరు రూ.25 నుంచి 50 లక్షల వరకు గెలుచుకున్నారని ఉచ్చు వేస్తారు. అంతేకాకుండా మీ లాటరీ నంబర్ ఇదేనని చెబుతారు. ఈ డ్రా డబ్బులు తీసుకునేందుకు వాట్సాప్ కాల్ చేయాలని 7224874316 సూచిస్తారు. ఈ నంబర్‌కు కాల్ చేసిన వారికి మీ అకౌంట్లో డైరెక్టుగా డబ్బులు వేస్తామని, దానికి మీరు ముందుగా కంపెనీ రూల్స్ ప్రకారం..రూ. 50 వేలు మా అకౌంట్లోకి పంపించాలని చెబుతారు. తర్వాత జీఎస్టీ వగైరా ఉంటాయని, మరో రెండు నుంచి రూ.5 లక్షలు పంపించాలని సూచిస్తారు. దీనికి తోడు మీకు ఓటీపీ వస్తుందని, అది చెబితే డబ్బులు పంపిస్తామని నమ్మబలుకుతారు. వారు పంపిన ఓటీపీ చెబితే క్షణాల్లో అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది.
వేలాది మందికి సందేశాలు..
కేబీసీ పేరుతో ఇప్పటికే వేలాది మందికి ఇలాంటి సందేశాలు వచ్చాయి. ఇప్పటికే కాల్ చేసిన కొంతమంది డబ్బులు పంపించాలని చెప్పడంతో అప్రమత్తమయ్యారు. ఇలాంటి సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా సందేశాలు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలుపుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను అసలు నమ్మొద్దు. నమ్మి వారి వలలో పడితే జేబులు గుళ్ల చేస్తారు. ఇలాంటి మెస్సేజ్లొస్తే పోలీ సులను సంప్రదించాలి. సైబర్ నేరాలపై పకడ్బందీ నిఘా పెట్టాం.
–ఎన్. శ్రీనివాస్, సీఐ, చౌటుప్పల్