రామగిరి, జూలై 9: పానగల్లో ప్రముఖ దేవాలయాలను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి శనివారం సందర్శించారు. తొలుత పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు. అదేవిధంగా పచ్చల సోమేశ్వరాలయంలో పరమేశ్వరుడికి పూజలు చేసిన అనంతరం ఛాయా సోమేశ్వరాలయానికి చేరుకున్నారు. అర్చకులు రామలింగేశ్వర శర్మ, ఉదయ్‌కుమార్ శర్మ, అజయ్‌కుమార్ శర్మ స్వాగతం పలికారు. నీటికొలను తిలకించిన తర్వాత ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి పాల్గొన్నారు.
అర్బన్ హెల్త్ సెంటర్ సందర్శన
నల్లగొండ రూరల్ : కేంద్ర వ్యవసాయ శాఖ సహయ మంత్రి కైలాస్చౌదరి శనివారం పట్టణం లోని పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్, రేషన్ దుకా ణాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రజలంతా కరోనా బూస్టర్ డోస్ వేయించుకోవాలని సూచించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజాప్రతినిధులు, యువమోర్ఛా జిల్లా పధాతికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. శనివారం తెల్లవారుజామున యోగా కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థు లకు సర్టిఫికెట్లు అందజేశారు.