నల్లగొండ, జూలై 9 : రుతుపవనాల ప్రభావంతో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు పాక్షికంగా నష్టం కలిగిస్తుండగా.. వరి సాగు చేసే రైతులకు ఊరటనిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు 83 శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా శనివారం 4 సెంటీమీటర్ల సగటు వర్షం కురిసింది. పత్తి మొక్కలు ప్రస్తుతం చిన్నగా ఉన్నందున వర్ష ప్రభావంతో నష్టం జరిగే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కంపాసాగర్ కేవీకే శాస్త్రవేత్త భరత్ సూచిస్తున్నారు.
4లక్షల ఎకరాల్లో సాగైన పత్తి
జిల్లాలో ఇటీవల వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వానకాలం సీజన్ సాగు జోరందుకుంది. వారం క్రితం 2.78 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా శనివారం నాటికి 4.13 లక్షలకు పెరిగాయి. రైతులు 3.98 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 12 వేల ఎకరాల్లో జీలుగు, 700 ఎకరాల్లో జనుము, 2100 ఎకరాల్లో వరి సాగు చేశారు. రెండు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనున్నది.
రైతులు జాగ్రత్త వహించాలి
జిల్లాలో 3.98 లక్షల ఎకరాల పత్తి పంట సాగు చేయగా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాటికి నష్టం కలిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పత్తి మొక్కలు చిన్నగా భూమిలో ఉన్నాయి. ఈ మొక్కలు మునగకుండా ఎప్పటికప్పుడు చెలకలో నుంచి నీరు తీసివేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కందితో పాటు, నేరుగా నాటిన వరి పంటకు కూడా నష్టం జరిగి అవి చనిపోయే అవకాశం ఉంటుందని, పొలంలో నీటని తీసి లీటరు నీటిలో రెండు గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు సాగు చేయని రైతులు వర్షాలు పూర్తిగా తగ్గాక, భూమి ఆరిన తర్వాత మరోసారి దున్ని మెట్ట పంటలు సాగు చేసుకోవాలని కంపాసాగర్ కేవీకే శాస్త్రవేత్త భరత్ సూచించారు. వరి సాగు చేసే రైతులకు మాత్రం పొలం దున్నుకోవటానికి వర్షం ఊరటనిచ్చింది.