రామన్నపేట, జూలై 9 : మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించినప్పుడే మహిళా సాధికారత సాధించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని వెల్లంకి గ్రామంలో గల కూరెళ్ల గ్రంథాలయంలో శనివారం నిర్వహించిన మహిళా భారతి సాహిత్య, సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవ సభలో పాల్గొని సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళాభ్యున్నతికి అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా కవులు, కళాకారులు రాష్ట్ర స్థాయిలో మహిళా భారతి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయని కొనియాడారు. దాశరథి పురస్కార గ్రహీత కూరెళ్ల మన జిల్లాలో పుట్టి తన ఆస్తులు, భూములను గ్రంథాలయం కోసం ఖర్చు చేయడం గర్వనీయమన్నారు. అంతకుముందు కూరెళ్ల విఠలాచార్య 85వ జన్మదినం సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ గాదే జలేందర్రెడ్డి, సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి, ఉపసర్పంచ్ రవ్వ అనసూయ, మహిళా భారతి గౌరవ అధ్యక్షురాలు నర్మద, అధ్యక్షురాలు దాసోజు పద్మావతి, ప్రధాన కార్యదర్శి పురిమళ్ల సునంద పాల్గొన్నారు.