నీలగిరి, జూలై 7 :ఒక విషాదం మరొక శుభోదయానికి నాంది పలికే సంఘటనలు వివిధ సందర్భాల్లో కనిపిస్తాయి. కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను
బలిగొన్నది. ఇప్పటికీ ప్రజలు కరోనా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కానీ, దాని వల్ల ఒక ప్రయోజనం చేకూరింది. జిల్లాలో అంటువ్యాధులు,విషజ్వరాలు మటుమాయమయ్యాయి. కరోనా రక్షణ చర్యల్లో భాగంగా పౌష్టికాహారం తీసుకోవడంతో ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగింది.
వ్యక్తిగత పరిశుభ్రత అలవడింది. శారీరక వ్యాయామం, యోగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతోపారిశుధ్యం మెరుగుపడింది. ఈగలు, దోమల వ్యాప్తి తగ్గడంతో వ్యాధులకు చెక్‌పడింది. నాలుగు సంవత్సరాల క్రితం పదుల సంఖ్యలో డెంగీ,మెదడువాపు, చికున్‌గున్యా, మలేరియా కేసులు నమోదు కాగా రెండేండ్ల నుంచి ఒకటి రెండు మాత్రమే ఉంటున్నాయి. గతేడాది నల్లగొండజిల్లాలో 17 వేల మంది విష జ్వరాల బారిన పడితే ఈ సంవత్సరం ఇప్పటివరకు నాలుగు వేలు నమోదయ్యాయి. అవి కూడా
సాధారణ జ్వరాలేనని వైద్యులు చెబుతున్నారు.
గతంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడి నానా ఇబ్బందులు పడేవారు. రోగులతో దవాఖానలు కిక్కిరిసిపోయేవి. వైద్యానికి ప్రజలు వేలకు వేలు ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోయేవారు. ప్రభుత్వం అనేక చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స, మందులు ఉచితంగా అందించింది. ఇప్పుడా పరిస్థితి మారింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది సీజనల్ వ్యాధులు భారీగా తగ్గాయి. రెండు సంవత్సరాలుగా కొవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని రకాల మందులు వాడడం వల్ల ప్రస్తుత సీజన్లో వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. కరోనా కారణంగా ప్రజలు అవసరాల మేరకే బయటకు వచ్చారు.
బయటకు వచ్చిన వారు కూడా వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా సోకిన ప్రాంతంలో అధికారులు పారిశుధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం, వేడి నీటిని తాగడం, పౌష్టికాహారం, మిటమిన్ మాత్రలు వాడడంతో చాలా వరకు సీజనల్ వ్యాధులు రాకుండా కట్టడి చేయగలిగారు. సాధారణంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. గతేడాది జిల్లాలో సుమారు 17వేల మంది విషజ్వారాల బారిన పడితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు నాలుగు నుంచి ఐదు వేల మంది మాత్రమే జ్వరాల బారిన పడ్డారని వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇవి కూడా సాధారణ జ్వరాలే.
హైరిస్క్ మండలాలు..
జిల్లాలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలే ప్రాంతాలను వైద్యారోగ్య శాఖ అధికారులు హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. ఇక్కడ ప్రత్యేకమైన పారిశుధ్య చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలకు దోమల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నల్లగొండ పట్టణం, దామరచర్ల, కొండమల్లేపల్లి, మర్రిగూడ, పెద్దవూర, నిడుమనూరు తదితర పీహెచ్‌సీలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు.
కలిసొచ్చిన కరోనా నివారణ చర్యలు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలు సీజనల్ వ్యాధులు మటుమాయం అయ్యేందుకు దోహదపడ్డాయి. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ప్రతి గ్రామలో, ఇండ్ల పరిసరాల్లో శానిటైజ్ చేశారు. దీంతోపాటు బ్లీచింగ్, క్లోరినేషన్ కార్యక్రమాలు చేపట్టారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగి శుభ్రత పట్ల అప్రమత్తంగా వ్యవహరించారు. ఇలాంటి చర్యలన్నీ సీజనల్, అంటువ్యాధులు దూరమయ్యేందుకు దోహదపడ్డాయని చెప్పవచ్చు. పారిశుధ్య కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తే చాలా వ్యాధులను దూరం పెట్టవచ్చనే విషయం ప్రస్తుత పరిణామాలతో స్పష్టమైంది.
గ్రామీణ ప్రాంతాలు సురక్షితం
జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యాధులకు సంబంధించి గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలన్నీ సురక్షితంగానే ఉన్నట్లు వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హైరిస్క్ ప్రదేశాలు లేనట్టేనని చెబుతున్నారు. కొన్నిచోట్ల పలు వ్యాధులు వెలుగు చూసినప్పటికీ అవి మరుసటి సీజన్ లేదా సంవత్సరానికి అంతర్ధానం కానున్నాయి. జిల్లాలో నల్లగొండ పట్టణం, పెద్దవూర, హాలియా, నిడమనూరు, కొండమల్లేపల్లి, దామరచర్ల, నాగార్జునసాగర్, ఆలగడప, మర్రిగూడ ప్రాంతాలు మలేరియా ప్రబలే ఆస్కారం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
దేవరకొండ, మర్రిగూడ, చండూరు, అక్కెనపల్లి, హాలియా, నార్కట్‌పల్లి, కేతేపల్లి, చిట్యాల, ఆలగడప, నల్లగొండ పట్టణం, నకిరేకల్, మునుగోడు, దామరచర్ల, డిండి, పెద్దవూర, నాంపల్లి, కొండమల్లేపల్లిలో డెంగీ.. డిండి, మునుగోడు, శాలిగౌరారం, దామరచర్ల, ఆలగడప, మిర్యాలగూడ, చిట్యాల, నిడమానూరు, నల్లగొండ పట్టణం, మర్రిగూడ, కొండమల్లేపల్లి, పెద్దవూర మండలాలు చికున్‌గున్యా ప్రబలే ఆస్కారం ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అంచనాలు వేసి ప్రణాళికలు రూపొందించగా.. ఎక్కడా ఎలాంటి జ్వరాలూ ప్రబలలేదు. ఒకటి రెండు గ్రామాల్లో మాత్రమే జ్వరాలు వచ్చినా.. అవి కూడా వైద్యారోగ్య శాఖ కంట్రోల్‌నే ఉన్నాయి.
అవగాహనతో దరిచేరని వ్యాధులు
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలడానికి ముందే కరోనా రావడంతో దానిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాం. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా కారణంగా గ్రామాలు, పట్టణాల్లో శానిటేషన్ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వా రా జ్వరాలు తగ్గాయి. దీనికితోడు ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పారిశుధ్య చర్య లు చేపట్టడం చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చాయి.
– డాక్టర్ అన్నీమళ్ల కొండల్రావు,నల్లగొండ డీఎంహెచ్ఓ