నల్లగొండ ప్రతినిధి, జూలై 6(నమస్తే తెలంగాణ) : రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోనే అత్యధిక లబ్ధి నల్లగొండ రైతాంగానికే చేకూరింది. అధిక మొత్తంలో పెట్టుబడిసాయంగా రైతులకు అందుతుండడంతో వ్యవసాయంలో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. సాగు ఆరంభంలో కీలకమైన పెట్టుబడి సమస్య రైతుబంధుతో దాదాపు సమసిపోయింది. గతంలో సన్నచిన్న కారు రైతులకు అప్పులు కూడా పుట్టగతులు కాకపోయేవి. దీంతో చాలా మంది సాగు చేయకుండా బీడుభూములుగా వదిలేసిన దాఖలాలు అనేకం. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2018 వానకాలం సీజన్ నుంచి ఎకరాకు ఇస్తున్న ఐదు వేల రూపాయల్లో మెజార్టీ పెట్టుబడి ఖర్చులు వెళ్లిపోతుండడంతో సాగు ఆరంభంలో ఇబ్బందులకు చెక్ పడినైట్లెంది. దీంతో రైతులు గతంలో పడావు ఉంచే భూమిని కూడా సాగులోకి తీసుకొస్తున్నారు.
దీనికి తోడు మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేయడం, ఉచిత కరెంటు సరఫరా, అవసరమైనన్నీ ఎరువులను సమకూర్చడం, పంటల కొనుగోళ్లకు భరోసా ఇవ్వడంతో రైతులు ప్రతి ఎకరానూ సేద్యం చేసేందుకు సిద్ధపడ్డారు. వీటన్నింటి ఫలితంగా ఎనిమిదేండ్లల్లో 8లక్షల ఎకరాల భూమి అదనంగా సాగులోకి రావడంతో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 21లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి. ఈ సీజన్లోనూ గత నెల 28వ తేదీ నుంచి రైతుబంధు డబ్బులను ప్రభుత్వం ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నది. తొలి రోజు ఎకరం లోపు నుంచి మొదలుపెట్టి బుధవారం నాటికి ఐదెకరాల లోపు రైతులందరికీ పథకం వర్తింపచేసింది.
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 14,97, 643 ఎకరాల భూమికి సంబంధించి 8,44,983 మంది రైతులకు 748,82,16,009 రూపాయలను విడుదల చేసింది. ఈ నగదులో ఎవరికీ ఒక్క పైసా లంచం ఇవ్వకుండా ప్రతి రూపాయి నేరుగా రైతు ఖాతాల్లోనే జమైంది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లుగా మెసేజ్లు వస్తుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నల్లగొండ జిల్లాలో 4,13,692 మంది రైతులకు రూ.373.59 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,34,310 మంది రైతులకు రూ.202.52 కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 1,96,981 మంది రైతులకు రూ.172.70 కోట్లు ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. దశలవారీగా మిగతా రైతులకు కూడా పెట్టుబడి సాయం అందనుంది.