నమస్తే తెలంగాణ ప్రతినిధి, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీలో ముఖ్యులు కలిసి పనిచేస్తున్నామని చెప్పుకుంటూనే కత్తులు దూసుకుంటున్నారు. మా జిల్లాకు రావొద్దని సీనియర్లు వ్యతిరేకించడంతో నల్లగొండ జిల్లాలో బుధవారం జరుగాల్సిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పర్యటన రైద్దెంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం కల్పించాలన్న లక్ష్యంతో తలపెట్టిన రాహుల్ గాంధీ పర్యటనకు ముందే సీనియర్ నేతలు చేస్తున్న రచ్చ చర్చనీయాంశంగా మారింది.
టీ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన దగ్గర పడుతుండడంతో నేతలంతా సభను విజయవంతం చేయడంలో తలమునకలయ్యారు. అయితే వరంగల్‌లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు జనసమీకరణ కోసం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగ ంగా బుధవారం నల్లగొండ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటించాల్సి ఉన్నది. అయితే రేవంత్ పర్యటనపై జిల్లాకు చెందిన ఎంపీలు ఇద్దరూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. మా జిల్లాలో తామే చూసుకుంటాం.. ఎవ్వరూ అవసరం లేదని బాహటంగానే ప్రకటిస్తున్నారు. రేవంత్‌రెడ్డి అవసరం మా జిల్లాకు లేదు అంటూ.. జిల్లాకు రావొద్దని పరోక్షంగానే హెచ్చరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. జన సమీకరణ కోసం పార్లమెంటు వారీగా ఇన్చార్జిలను నియమించినప్పుడు కూడా ఇదే రకమైన సమస్య సృష్టించారు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి నేతలు తమకు ఏ ఇన్చార్జీలు అవసరం లేదని తమ జిల్లాలో తాము చూసుకుంటామని చెప్పడంతో అప్పట్లో గీతారెడ్డి వెనక్కి తగ్గారు.
పీసీసీ అధ్యక్షుడి పర్యటన రద్దు ..?
రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. బుధవారం నల్లగొండ పర్యటన ఉండడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి నేతలు రేవంత్ పర్యటన వ్యతిరేకిస్తున్నారు.దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడు తన పర్యటన రద్దు చేసుకున్నారని తెలిసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నల్లగొండ సమీక్షా సమావేశం అనుకున్న సమయానికి కాకుండా మే 1 తరువాత ఉంటుందని రేవం త్ వర్గీయులు చెప్తున్నారు. అయితే ఇది అంత ఈజీ కాదన్న చర్చ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
గందరగోళంలో కాంగ్రెస్ క్యాడర్
మరోవైపు కొందరు నేతలు మంగళవారంచౌటుప్పల్ మండలంలోని ఆందోళ్ మైసమ్మ ఆలయం ఓ ఫంక్షన్హాల్లో భేటీ అయి రేవంత్‌రెడ్డి పర్యటన విజయవంతం చేసి తీరుతామని ప్రకటించారు. రేవంత్‌రెడ్డిని అడ్డుకోవడం అంటే పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడమేనని వారు ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు ఇప్పటికే నైరాశ్యంలో ఉన్న క్యాడర్‌ను మరింత గందరగోళంలో పడేస్తున్నాయి. వరంగల్‌లో రాహుల్ సభ జరిగేలోపు ఎన్ని చూడాల్సి వస్తుందో అని కాంగ్రెస్ క్యాడర్ మదనపడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉమ్మడి జిల్లా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ పెద్దలు ఎలా స్పందిస్తారోనన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.