నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : యాసంగి వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్ రాజీలేని పోరు సాగిస్తుంది. రాష్ట్ర రైతులపై కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఛేదించే దిశగా ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తున్నది. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది. క్షేత్రస్థాయి నుంచి పట్టణాలకు వరకు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు మోదీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతీ రైతు ఇంటిపై నల్లజెండా ఎగురవేసి కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు. సూర్యాపేటలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తన ఇంటిపై స్వయంగా జెండా ఎగురవేయగా ఎమ్మెల్యేలు కూడా తమ ఇండ్లు, క్యాంపు కార్యాలయాపైనా నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నల్లజెండాలు ఎగురవేశారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు బైక్ ర్యాలీలకు సారధ్యం వహిస్తూ ఆందోళనలో ముందు నడిచారు. ఈ నెల 11న ఢిల్లీలో చేపట్టే నిరసన దీక్షలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పలువురు ముఖ్య నేతలు సన్నద్ధం అవుతున్నారు.
నల్లగొండలోని వీటి కాలనీలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తన ఇంటిపై నల్లజెండాను ఎగరవేసి నిరసన తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పీఏపల్లి మండలం అంగడిపేటలో ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ నల్లజెండాలు ఎగరవేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇక మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి, నల్లజెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహానం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ బైక్ నడుపుతూ నిరసన ర్యాలీకి నాయకత్వం వహించారు. నల్లజెండాలను ఎగరవేసి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనుముల మండలం పాలెం గ్రామంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి రైతుల ఇండ్లపై నల్లజెండాలు ఎగరవేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా నిరసనల కార్యక్రమం విజయవంతంగా సాగింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల సారధ్యంలో నల్లజెండాల ఎగరవేసి, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
సూర్యాపేట జిల్లా అంతటా నల్లజెండాల నిరసన ఉధృతంగా సాగింది. సూర్యాపేటలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ తన ఇంటిపై నల్లజెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. పట్టణంలోనూ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులంతా తమ ఇండ్లపై నల్లజెండాలను ఎగరవేసి నిరసన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. హుజూర్నగర్ నియోజకవర్గవ్యాప్తంగా నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన క్యాంపు కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసి నిరసనకు శ్రీకారం చుట్టారు. హుజూర్‌నగర్‌లో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నేరడుచర్ల మండల కేంద్రంలోనూ ఎమ్మెల్యే సైదిరెడ్డి నల్లబ్యాడ్జీలు, జెండాలు ధరించి బైక్ ర్యాలీకి నాయకత్వం వహించారు. ఇక్కడా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోదాడ నియోజవర్గ వ్యాప్తంగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోదాడలోని పార్టీ కార్యకర్తల ఇండ్లపై నల్లజెండాలను ఎగురవేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నల్లజెండాలతో పట్టణంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గవ్యాప్తంగా నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగింది. అన్ని గ్రామాలు, పట్టణాల్లోనూ నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు, మోదీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఇదే సందర్భంగా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు తమ ఇండ్లపై స్వయంగా నల్లజెండాలను ఎగురవేశారు. ఊర్లల్లో ఇండ్లపై, ముఖ్య కూడళ్లల్లో ఎక్కడ చూసినా నల్లజెండాల రెపరెపలే కనిపించాయి. దీంతో క్షేత్రస్థాయి వరకు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యిందన్న చర్చ సర్వత్రా వినిపిస్తున్నది.