స్వయంభు నారసింహుడికి నిత్యారాదనలు
యాదాద్రి, ఏప్రిల్8: యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి స్వయంభు ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడి సేవ ముందు నడిచారు. అనంతరం ఊయలలో శయనింపు చేశారు. స్వామి వారికి నిత్యారాధనలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము 3గంటల నుంచి పూజలు మొదలయ్యాయి. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉదయం 4గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు.
లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేయడంతో పాటు, హారతి నివేదనలు చేశారు. ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చనలు నిర్వహించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి, లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం బస్సుల్లో కొండపైకి చేరుకుని స్వయంభువులను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత దర్శనాలు కొనసాగాయి. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర బాలాలయంలో సీతారామచంద్ర వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ. 16,69,252 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
లక్ష్మీపుష్కరిణిలో జలాలు శుద్ధి
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండ కింద లక్ష్మీపుష్కరిణిలో గల గుండంలోని జలాలను ఆలయ సిబ్బంది శుక్రవారం శుభ్రం చేశారు. మార్చి 28న గుండంలో నింపిన నీటిని తొలగించారు. పది రోజులుగా భక్తులు స్నానమాచరించగా గుండంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటితో గుండాన్ని నింపారు.